వేగం ఉంది..వివేకం లేదు

15 Feb, 2019 06:56 IST|Sakshi

ప్రస్తుత నిర్మాతల మండలి నిర్వాకంలో వేగం ఉంది గానీ వివేకం లేదు అని సీనియర్‌ దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ విమర్శంచారు. డీకే.పిక్చర్స్‌ పతాకంపై జే.ధనలక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం కోణలా ఇరుందాలుమ్‌ ఎన్నోడదు. క్రిషిక్‌ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఢిల్లీగణేశ్, పవర్‌స్టార్, అభినవ్, తీపెట్టి గణేశ్, కేకే.శేషు, క్రేన్‌మనోహర్, జ్యోతిలక్ష్మి, షకీలా ముఖ్య పాత్రలను పోషించారు. కృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న దీనికి వల్లవన్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం స్థానికి టీనగర్‌లోని ఎంఎం.థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ మాట్లాడుతూ తాను సినీ రంగంలోకి ప్రవేశించాలని భావించినప్పుడు తొలిరోజునే పురట్టి తలైవర్‌ ఎంజీఆర్‌ను కలిసి ఆయన సిఫార్సుతోనే ఈ రంగంలోకి వచ్చానని తెలిపారు.

రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్‌ హీరోలతో చిత్రాలు చేసినట్లు చెప్పారు. తాను మూడుసార్లు నిర్మాతల మండలిలో వివిధ పదవులకు బాధ్యతలు నిర్వహించానని, ప్రతిసారి సినిమా రంగానికి ఏదైనా మంచి చేయాలని భావించానని, అయితే అక్కడి సిస్టమ్‌ సరిలేక తనను ఏమీ చేయనివ్వలేదని అన్నారు. ప్రస్తుతం మండలి కార్యవర్గంలోకి తానుగానే ప్రవేశించి వారికి, ప్రభుత్వానికి వారధిగా ఉండి సినీరంగానికి పలు మంచి విషయాలను చేయడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. చిన్న చిత్రాలకు థియేటర్ల సమస్య ఉందన్న విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళ్లగా 100 మినీ థియేటర్లను కట్టించడానికి సంకల్పించారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే సినీ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరి బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో సినీరంగానికి మంచి చేయాలనుకున్న ప్రభుత్వం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటి నిర్మాతల మండలి తనను కరివేపాకు మాదిరి వాడుకుని వదిలేస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ఇప్పుటి మండలి నిర్వాకంలో వేగం ఉందిగానీ, వివేకం లేదని విమర్శించారు. దర్శకుడు పేరరసు, గిల్డ్‌ అధ్యక్షుడు జాగ్వర్‌తంగం, జిప్సీ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు