కోనసీమ ఆప్యాయత నన్ను కట్టిపారేస్తుంది

24 Jan, 2015 13:25 IST|Sakshi
కోనసీమ ఆప్యాయత నన్ను కట్టిపారేస్తుంది

కోనసీమ అభిమానం, ఆప్యాయత తనను కట్టి పారేస్తాయని దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ పలు సందర్భాల్లో చెప్పేవారు. కావడానికి పశ్చిమగోదావరి వాస్తవ్యుడే అయినా.. ఆయనకు తూర్పుగోదావరి జిల్లాతోను, అందునా కోనసీమ ప్రాంతంతోను అనుబంధం జాస్తి. ఎమ్మెస్ 700 చిత్రాల్లో నటించగా, వాటిల్లో 100కు పైగా సినిమాల షూటింగ్‌లు ఈ జిల్లాలోనే జరిగాయి. దీంతో ఆయనకు  తూర్పుగోదావరిలో పలువురు అభిమానులే కాకుండా సన్నిహితులు కూడా అయ్యారు.

ఇక్కడ జరిగిన పలు సినిమా షూటింగ్‌లలో ఆయన పాల్గొన్నారు. కోనసీమలో జరిగిన కబడ్డీ.. కబడ్డీ, చెడుగుడు, రామదండు, పందెం, ప్రేమలో పావని-కళ్యాణ్, చందమామ కథలు, శశిరేఖ పరిణయం, బావ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. పెదపట్నం లంక, మామిడికుదురు, నగరం, సోంపల్లి, అంతర్వేది, అంతర్వేదికర, దిండి, చింతలపల్లి, గుడిమూల వంటి ప్రాంతాల్లో షూటింగ్‌లు జరిగాయి. అమలాపురంలో 2004లో జరిగిన చెన్నమల్లేశ్వర కళా పరిషత్ నాటకోత్సవాలకు ఎమ్మెస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిషత్ అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ ఆయనకు మంచి మిత్రుడు.

కోనసీమ అంటే మాత్రం ఎమ్మెస్‌కు ప్రత్యేక అభిమానం. 'ఇక్కడి పచ్చని వాతావరణం.. ప్రజలు చూసే ఆత్మీయత.. ఆతిథ్యం నన్ను కట్టిపడేస్తుంటాయి' అని పలు సందర్భాల్లో చెప్పేవారు. గత డిసెంబర్ 21న భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన విద్యార్థులను కలుసుకున్నారు. బహుశా తనకు ఇష్టమైన కోనసీమను చూడడం అదే ఆఖరుసారి అవుతుందని ఎమ్మెస్ అనుకుని ఉండరు. ఆయన దర్శకత్వం వహించిన భజంత్రీలు సినిమా షూటింగ్‌లో కొంతభాగం కోరుకొండలో జరిగింది.

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో 'నువ్వే.. నువ్వే' చిత్రంలో కానిస్టేబుల్‌గా ఎమ్మెస్ నటించింది పది నిమిషాలే అయినా ఆయన పండించిన కామెడీ ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోతుంది. రచయితగా, హాస్య నటునిగానే కాదు.. కుమారుడు విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకునిగా కూడా ఎమ్మెస్ మారారు. ఈ చిత్రానికి జిల్లాలోని ముమ్మిడివరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, దివంగత తాడి తాతారావు నిర్మాతగా వ్యవహరించారు.