అలా వచ్చిందే.. 'అయితే ఓకే'

3 Nov, 2015 11:58 IST|Sakshi
అలా వచ్చిందే.. 'అయితే ఓకే'

చిత్రమైన శైలిలో ‘అయితే... ఓకె’ అంటూ డైలాగ్ విరుపుతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ప్రముఖ హాస్యనటుడు, రంగస్థల కళాకారుడు కొండవలస లక్ష్మణరావు. సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక మరణంతో కళాభిమానులు శోకంలో మునిగిపోయారు. సినిమాల్లోకి రాక ముందే రంగస్థలంపై ఆయన ప్రసిద్ధులు.

 విశాఖ పోర్ట్ టు వెండితెర
సినీ రంగంలోకి రాక ముందు విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో కొండవలస ఉద్యోగం చేశారు. రంగస్థలంపై కొన్ని వందల కొద్దీ నాటక ప్రదర్శనలిచ్చిన కళాకారుడాయన. రంగస్థలంపై ఆయన ప్రతిభ చూసి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి. రఘు తన దర్శకత్వంలో తీసిన ‘కళ్ళు’ (1988) చిత్రంలో రౌడీ పాత్ర ద్వారా కొండవలసను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆ తొలి చిత్రం తరువాత చాలా కాలం గ్యాప్ వచ్చిన కొండవలస మళ్ళీ వంశీ దర్శకత్వంలోని ‘ఔను... వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ (2002)తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలోని ‘అయితే... ఓకె’ అనే డైలాగ్‌తో సినీరంగంలో స్థిరమైన స్థానం సంపాదించారు. గడచిన పదమూడేళ్ళుగా దాదాపు 200 పై చిలుకు చిత్రాల్లో కమెడియన్‌గా రాణించి, ప్రేక్షకులను నవ్వించారు. ఆయన నటించిన చిత్రాల్లో ‘కబడ్డీ... కబడ్డీ’, ‘ఎవడి గోల వాడిది’, ‘రాఖీ’, ‘రాధా గోపాళం’, ‘సైనికుడు’ లాంటి పాపులర్ సినిమాలు అనేకం ఉన్నాయి.
 
 ఉత్తరాంధ్ర ప్రతిభాకిరణం
     సినీ రంగంలో కొండవలసగా ప్రసిద్ధులైన కొండవలస లక్ష్మణరావు స్వగ్రామం - శ్రీకాకుళం జిల్లాలోని కొండవలస అనే పల్లెటూరు. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు కూడా. కొండవలస తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి ఉద్యోగ రీత్యా ఆయన కొన్నాళ్ళు ఒడిశాలోని కంటాబంజీలో కూడా ఉన్నారు. అక్కడకు వచ్చే బుర్రకథ బృందాలు చూసి, చిన్నప్పుడే కొండవలస ప్రేరణ పొందారు. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధమైన కుమ్మరి మాస్టారు బుర్రకథ చూసి ఆయననూ, అలాగే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళనూ అనుకరించడం ద్వారా కొండవలస నటన వైపు బుడిబుడి అడుగులు వేశారు.

 నాటక రచన... మేకప్ ఆదాయం...
 విశాఖపట్నంలో కాలేజీలో చదువుకొనే రోజుల్లో ‘సవతి తల్లి’ అనే నాటికలో ద్విపాత్రాభినయం చేసి, బహుమతి అందుకున్న కొండవలస ఆ తరువాత నాటకాల వైపు మొగ్గారు. విశాఖలోని ఏ.వి.ఎన్. కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజీలో విస్తృతంగా నాటకాలు వేస్తూ వచ్చారు. డిగ్రీ పూర్తవగానే పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్కు ఉద్యోగం రావడంతో, అందులో చేరిపోయారు. పోర్ట్ ట్రస్ట్‌లో ఏటా జరిగే నాటికల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొండవలసకు బాగా కలిసి వచ్చాయి. రాష్ట్రస్థాయి నాటకాల పోటీల్లో పాల్గొని, బహుమతులు అందుకున్నారు. ‘స్వార్థం బలి తీసుకుంది’, ‘హెచ్చరిక’, ‘స్వాగతం’ అనే మూడు నాటకాలు కూడా రాసిన ఆయన, స్వయంగా మేకప్ వేయడం కూడా నేర్చుకున్నారు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు, నలుగురు అన్నదమ్ములతో కూడిన పెద్ద కుటుంబం ఆయనది. ఆ కుటుంబ బాధ్యతలు తీర్చడానికి అప్పులు కూడా చేయాల్సి వచ్చేది. ఆ పరిస్థితుల్లో మేకప్ చేయడం ద్వారా వచ్చే సంపాదన కూడా కొంత ఉపయోగపడిందని కొండవలస ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

 రంగస్థలంపై రెండు నందులు
     రంగస్థల అనుభవం వల్లే ఆయనకు కుప్పిలి వెంకటేశ్వరరావు, చాట్ల శ్రీరాములు, మిశ్రో, కృష్ణజిత్, రావూజీ లాంటి రంగస్థల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమశిక్షణ, అంకితభావం, పెద్దల పట్ల గౌరవం లాంటి ఎన్నో విషయాలు వాళ్ళ నుంచి నేర్చుకున్నానని కొండవలస చెబుతూ ఉండేవారు. సినీ రంగానికి రాకముందే ఆయన నంది అవార్డు గ్రహీత. ‘నవరాగం’ నాటకంలో ఉత్తమ నటుడిగా, ‘కేళీ విలాసం’ నాటకంలో ఉత్తమ విలన్‌గా రెండు నంది అవార్డులు ఆయనకు వచ్చాయి. అనేక పదుల ప్రదర్శనలు ఇచ్చిన ‘రేపటి శత్రువు’ నాటకంలో క్లైమాక్స్‌లో కొండవలస చూపే భావోద్వేగభరిత అభినయం ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పించేది.

 ఆ సినిమాతో... ఔను... అందరూ ఇష్టపడ్డారు!
     తొలి చిత్రం ‘కళ్ళు’లో అవకాశం కానీ, ఆ తరువాత చాలాగ్యాప్ వచ్చాక ద్రాక్షారామంలో నాటక ప్రదర్శనలో దర్శకుడు వంశీ చూసి ‘ఔను... వాళ్ళిద్దరూ...’లో ఇచ్చిన రీ-ఎంట్రీ ఛాన్స్ కానీ కొండవలసకు రంగస్థలం పెట్టిన భిక్షే.  ఇక, అక్కడ నుంచి కొండవలస వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినీ రంగంలో కమెడియన్ బ్రహ్మానందం ఆయనకు బాగా సన్నిహితులు. గతంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు బ్రహ్మానందం తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కొండవలస చాలా కృతజ్ఞతతో చెబుతూ ఉండేవారు. వంశీ, ఇ.వి.వి. సత్యనారాయణ లాంటి ప్రసిద్ధ హాస్య చిత్రాల దర్శకులందరితో పనిచేసిన కొండవలస రంగస్థల నటనను స్వర్గీయ జంధ్యాల కూడా మెచ్చుకున్నారు. రంగస్థల అభినయానికి జంధ్యాల నుంచి బహుమతి అందుకున్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఆయన వద్ద నటించలేకపోవడం తనకు తీరని వెలితేనని కొండవలస ఎప్పుడూ అంటూ ఉండేవారు. ఇప్పుడు కొండవలస మృతితో తెలుగు హాస్య కుటుంబానికి వచ్చిన వెలితి కూడా ఇప్పుడిప్పుడే తీరేది కాదు! సినీ హాస్య ప్రియులకు ఈ మరణవార్త ఎంతమాత్రం ‘....ఓకె’ కాదు!!

 స్టైల్ మారిస్తే... ‘అయితే... ఓకె’
 రంగస్థలంపై ఎంతో పేరు, నంది అవార్డులు తెచ్చుకున్న కొండవలస లక్ష్మణరావు వాయిస్ కామెడీ గురించి ఇవాళ అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదట్లో ఆయనకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. అప్పుడు కొండవలస కష్టపడి, కొత్త రకంగా వాయిస్‌తో ట్రై చేశారు. అలా వచ్చిందే ఆయన ‘అయితే... ఓకే’ స్టైల్.

 కొండవలస గొంతు సీరియస్‌గా ఉందనీ, కొత్తదనం కోసం వేరొకరితో డబ్బింగ్ చెప్పిద్దామనీ ‘ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ దర్శకుడు వంశీ మొదట అనుకున్నారు. కానీ, కొండవలస అలా కాదని, కష్టపడి, తన గొంతు చిత్రమైన యాస చేర్చి, డైలాగ్ చెప్పి, వినిపించారు. ఆ స్టైల్ ఓ.కె అయింది. అలా ఆయనకు ‘అయితే... ఓకె’ అనే స్టైల్ ఒక ట్రేడ్ మార్క్ అయింది. ఆయన వాయిస్, ఆ వాయిస్ కామెడీనే సినిమా కెరీర్ అంతటా ఆయనకు అనేక పాత్రలు తెచ్చిపెట్టింది.


 - రెంటాల జయదేవ