‘అది కరోనా కన్నా భయంకరమైనది’

14 Jul, 2020 20:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ సోకినవారికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో కొందరు దానిని రహస్యంగా ఉంచుతున్నారని.. అలా చేయడం వైరస్‌ కన్నా ఎక్కువగా భయంకరమైన అనుభవాన్ని కలుగజేస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘కరోనా పాజిటివ్‌గా తేలినవారందరికీ నా హృదయపూర్వక అభ్యర్థన.. మనం అందరం బాధ్యతయుతంగా వ్యవహరిద్దాం. కరోనా సోకిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సన్నిహితులకు, ఇటీవల కలిసినవారికి తెలియజేయండి. తద్వారా వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందడి. మనం మరింత నాగరికంగా ఉండాల్సిన సమయం ఇది. కొంతమంది వైరస్‌ సోకిన వ్యక్తులు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇది వైరస్‌ కన్నా ఎక్కువగా భయంకరమైన అనుభవాన్ని కలిగిస్తుంది’ అని శివ పేర్కొన్నారు. 

ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ అప్పటి నుంచి ఈ చిత్రం షూటింగ్‌ నిలిచిపోయింది. తదుపరి షూటింగ్‌ షెడ్యూల్‌పై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

మరిన్ని వార్తలు