అందరూ కనెక్ట్‌ అవుతారు

25 May, 2019 00:33 IST|Sakshi
భీమనేని శ్రీనివాసరావు, కేయస్‌ రామారావు, ఆండ్రూ, కార్తీక్‌ రాజు

– కేయస్‌ రామారావు

‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు దర్శకునిగా భీమనేని శ్రీనివాసరావు అయితే కరెక్ట్‌ అనిపించింది. తనను సంప్రదించగానే ఇష్టంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేశాడు’’ అని చిత్ర సమర్పకులు కేయస్‌ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేశ్‌ టైటిల్‌ రోల్‌లో, రాజేంద్రప్రసాద్, కార్తీక్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని భీమనేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేయస్‌ రామారావు మాట్లాడుతూ– ‘‘అందరూ కనెక్ట్‌ అయ్యే క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌గార్ల టైమ్‌లో ‘అమరసందేశం’ వంటి మంచిసినిమాలో హీరోగా నటించిన దివంగత హీరో అమర్‌నాథ్‌ మనవరాలు, హీరో రాజేశ్‌ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నారు. తను చాలా మంచి నటి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్‌ వస్తోంది. తనతో మరో సినిమా కూడా చేయబోతున్నా. మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి కావస్తోంది. జూన్‌ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథలు కోరుకుంటారు. అలాంటి వాటికోసం వెతుకుతున్న టైమ్‌లో ‘కణా’ సినిమా చూశా. ఈ చిత్రం తెలుగు రీమేక్‌ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటే నా వరకూ వస్తుందా? అనుకున్నా. ఓ రోజు రామారావుగారు ఫోన్‌ చేసి ‘కణ’ రీమేక్‌ హక్కులు కొన్నాను, మనం చేద్దామనగానే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆయన్ని కలిసి ‘ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం సార్‌ చేద్దా’మన్నాను.

ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి క్రికెట్‌ నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? అన్నదే చిత్రకథ. ఇందులో తండ్రి, కూతురు మధ్య మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. కథానాయిక తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు నటించారు. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యారాజేష్‌ ఇతర భాషల్లో నటిగా నిరూపించుకుని మా సినిమాతో తెలుగుకి పరిచయం అవుతున్నారు. తనలో చాలా ప్రతిభ ఉంది. ఎమోషనల్‌ సీ¯Œ ్స తీస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా గ్లిజరిన్‌ వాడలేదు. తను పిలిస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి’’ అన్నారు. కెమెరామెన్‌ ఆండ్రూ, ఆర్ట్‌ డైరెక్టర్‌ శివ శ్రీరాములు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు