శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు

25 Aug, 2019 04:38 IST|Sakshi
కేయస్‌ రామారావు, ఐశ్వర్యా రాజేశ్, భీమనేని శ్రీనివాసరావు

– కేయస్‌ రామారావు

‘‘సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించడం కూడా అవసరం. అప్పుడే ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్‌ ఉంది. సినిమా చూసినవారు ‘శంకరాభరణం, మాతృదేవోభవ’ లాంటి గొప్ప సినిమా అని అభినందిస్తున్నారు. ఇకపై కూడా మా బ్యానర్‌లో మా గత సినిమాల్లానే క్వాలిటీతో పాటు మంచి పర్పస్‌ ఉన్న సినిమాలే అందిస్తాం’’ అన్నారు కేయస్‌ రామారావు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, కార్తీక్‌ రాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కేయస్‌ రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు.

గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు కలెక్షన్లూ సాధిస్తోందని చిత్రబృందం తెలిపింది. శనివారం సక్సెస్‌ మీట్‌లో ఐశ్వర్యా రాజేశ్‌ మాట్లాడుతూ –  ‘‘తమిళంలో ఎలా ఆదరించారో తెలుగులోనూ ఈ సినిమాను అలానే ఆదరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి ఈ ప్రశంసలను సపోర్ట్‌గా భావిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాకు పునాది కథ. మంచి కథ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్‌ అయ్యాం. ఈ బ్యానర్‌లో గతంలో వచ్చిన గొప్ప సినిమాలకు దీటుగానే ఈ సినిమా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్‌. ‘‘ఒక గొప్ప సినిమాకు పాటలు రాసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాంబాబు గోసాల. ‘‘కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి సినిమాయే ‘కౌసల్య కృష్ణమూర్తి’’ అన్నారు బీఏ రాజు.

‘ఇండియన్‌ 2’ నుంచి తప్పుకున్నాను
కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ది ఓ కీలక పాత్ర. డేట్స్‌ క్లాష్‌ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. ఇలాంటి సినిమా వదులుకోవడం బాధగా ఉందని ఐశ్వర్య తెలిపారు.

మరిన్ని వార్తలు