బాలకృష్ణను గుర్తు తెచ్చుకుని తొడ కొట్టా!

9 Feb, 2016 23:59 IST|Sakshi
బాలకృష్ణను గుర్తు తెచ్చుకుని తొడ కొట్టా!

‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి ఘనవిజయాల తర్వాత నాని నటించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. నాని, మెహరీన్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. నాని పంచుకున్న ముచ్చట్లు...
 
♦  ఈ చిత్రానికి ముందే ‘అందాల రాక్షసి’, మరో రెండు కథలను హను నాకు వినిపించాడు. అయితే అవి నాకు నప్పవని చేయలేదు. ఆ తర్వాత నన్ను దృష్టిలో పెట్టుకునే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ రాశారు. సినిమా కథ, షూటింగ్, రిజల్ట్ విషయంలో మేము టెన్షన్ పడలేదు. అయితే సినిమా టైటిల్ విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడ్డాం. ఏ టైటిల్ పెడితే బాగుంటుందని చర్చించుకుని నా పాత్ర పేరు కృష్ణ కాబట్టి,  ఫైనల్‌గా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ యాప్ట్ అవుతుందని పెట్టాం.
 
  ఈ కథలో నాయకుడు కృష్ణ బాగా పిరికివాడు. అయినా పైకి గంభీరంగా, ధైర్యవంతుడిగా కనిపిస్తుంటాడు. నాకు తెలిసి పైకి ధైర్యవంతుల్లా కనిపించే వాళ్లందరూ పిరికివాళ్లే. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. ఇందులో ఇంగ్లీష్ రాదు కానీ, వచ్చినట్టు మేనేజ్ చేస్తుంటా. రియల్ లైఫ్‌లో నాకు బాగా ఇంగ్లీష్ వచ్చు. ‘టైటానిక్’ సినిమా చాలాసార్లు చూడటంతో ఇంగ్లీష్ పరీక్షల్లో ఆ చిత్రం స్టోరీ రాసేవాణ్ణి. అయినా ఒక్కసారి కూడా నేను ఇంగ్లీష్‌లో ఫెయిల్ కాలేదు.
 
  రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. హీరో బోర్లు వేసే కాంట్రాక్ట్ తీసుకుని వేయిస్తుంటాడు. ఉదయం నుంచి ఆ పనిలో ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఫ్రెండ్స్‌ను కలవడం, సరదాగా ఎంజాయ్ చేయడం చేస్తుంటాడు. నేను రియల్ లైఫ్‌లో కమల్‌హాసన్‌గారి అభిమానిని. ఇందులో బాలకృష్ణగారి అభిమానిగా నటించా. అనంతపురం, హిందూపురాలకు స్టోరీతో లింక్ ఉంది. ఇందులో ఇంట్రడక్షన్ సీన్‌లోనే బాలకృష్ణగారి పేరు చెప్పుకుని బయటపడే సీన్ ఉంటుంది. ప్రతి సీన్ కథలో కనెక్ట్ అయి ఉంటుంది. ఓ సీన్‌లో విలన్లను కొట్టేందుకు అవసరమైన ధైర్యం కోసం బాలకృష్ణ గారిని గుర్తుకు తెచ్చుకుని తొడ కొట్టే సీన్ కూడా ఉంది.  
 
 ఆడియో రోజున జూ. ఎన్టీఆర్, మహేశ్‌బాబు మాటలు విన్నప్పుడు ఇగో లేకుండా మాట్లాడారనిపించింది. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’ విజయాలతో ఈ చిత్రం గురించి టెన్షన్ పోయింది. అంతకు ముందు ఫ్లాపులు వచ్చినప్పుడు టెన్షన్ ఉండేది. ‘జెండాపై కపిరాజు’ చిత్రం కోసం రెండేళ్లకుపైగా కష్టపడ్డా ఆశించిన ఫలితం రాలేదు. ‘భ లే భలే మగాడివోయ్’ని ఆరే నెలల్లో పూర్తి చేసినా ఘన విజయం సాధించింది.
 
  రెమ్యునరేషన్ పెంచానంటున్నారు. పెంచక తప్పదు. ఎందుకంటే నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన మొదటి చిత్రానికి రూ. 2500, రెండో సినిమాకు 3500 తీసుకున్నా. ఇప్పుడు హీరో అంటే తప్పదుగా. నేనే కాదు.. ఎవరైనా సినిమా సినిమాకు పెంచుతారు.
 
  ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నా. ఆ చిత్రం తరు వాత ఆనంది ఆర్ట్స్‌లో ఓ చిత్రం చేస్తా. ఇకపై గ్యాప్ లేకుండా సిన్మాలు చేస్తా.