సూపర్.. ‘డూప్’రే

25 Jul, 2018 12:02 IST|Sakshi
మోహన్‌బాబు డూప్‌గా చావలి విశ్వేశ్వర్‌రావు , బాలకృష్ణ డూప్‌గా దివాకర్‌, పవన్‌కల్యాణ్‌ డూప్‌గా బాబీ

సినిమాల్లో డూప్‌లకు ఒకప్పుడు ప్రాధాన్యం 

సాంకేతికత అభివృద్ధితో నేడు ఆదరణ కరువు  

గ్రాఫిక్స్‌ మాయాజాలంతో తగ్గిన అవకాశాలు

ఒకరు బాలయ్యలా భారీ డైలాగులతో ఈరగదీస్తే.. మరొకరు ఏఎన్నార్‌లా స్టెప్పులతో స్టేజీపై కేక పుట్టిస్తారు. వాళ్లను చూస్తే నిజంగా హీరోలని చాలామంది భావిస్తారు.. భ్రమిస్తారు. ఆ మేనరిజం, హావభావాలు అచ్చు అలాగే ఉంటాయి మరి! ఆయా హీరోలకు జిరాక్స్‌లుగా, తెరపై సూపర్‌ డూపర్‌గా నటించిన ‘డూప్‌’ క్యారెక్టర్లకు ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అయితే టెక్నాలజీ నేపథ్యంలో, గ్రాఫిక్స్‌ మాయాజాలంతో డూప్‌ క్యారెక్టర్లకు ఆదరణ, అవకాశాలు రెండూ తగ్గాయి. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో మొదలైన డూపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

బంజారాహిల్స్‌: కృష్ణానగర్‌ అంటే బట్టలు, సెట్టింగ్‌లు, కెమెరాలు, మెస్‌ తదితర సామాగ్రి మాత్రమే కాదు... మనుషులను పోలిన మనుషులూ ఇక్కడ అద్దెకు దొరుకుతారు. అసలైన హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అభిమానులను అలరిస్తారు.. అచ్చంగా వారినే అనుకరిస్తారు. సినిమాల్లో హీరోలకు డూప్‌లుగా క్యారెక్టర్‌ వేసే వీరు... ఖాళీ సమయాల్లో స్టేజీ షోలు, ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొని అలరిస్తుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్‌కల్యాణ్‌... ఇలా ప్రతి ఒక్కరీ డూప్‌లు ఇప్పుడు చాలామంది కనిపిస్తున్నారు. 

బ్లాక్‌ అండ్‌ వైట్‌.. భలే హిట్‌
బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా ప్రపంచంలో డూప్‌లకు భలే డిమాండ్‌ ఉండేది. ఫైటింగ్, జంపింగ్‌ తదితర సాహసోపేతర సన్నివేశాలకు డూప్‌లను ఆశ్రయించేవారు. ఇక డబుల్‌ యాక్షన్‌ సినిమాల్లో డూప్‌ పాత్రలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు సత్యనారాయణ డూప్‌గా చేయగా, కృష్ణానగర్‌లో నివసించే మూర్తి ఏఎన్నార్‌కు డూప్‌గా పని చేశాడు. చాలా సినిమాల్లోనూ వీరు ఆయా హీరోల పాత్రల్లో కనిపించారు. ‘మనం’ సినిమాలోనూ ఏఎన్నార్‌ డూప్‌గా మూర్తి చేశాడు. అదే విధం గా ఇక్కడే నివసిస్తూ అక్కినేనితో కాలేజీ బుల్లోడు, కలెక్టర్‌ గారి అబ్బాయి తదితర సినిమాల్లో నటించిన జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ ఏజెంట్‌ ఘంటసాల అందరికీ సుపరిచితమే. ఇక చిరంజీవిని పోలి ఉండే రాజ్‌కుమార్‌ ఆయన డూప్‌గా సుపరిచితం. అప్పట్లో ఒక్కో హీరో రోజుకు రెండు, మూడు సినిమాల్లో చేసేవారు. ఈ నేపథ్యంలోనే చిన్ని చిన్న సన్నివేశాల్లో డూప్‌లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చేవారు. 

టెక్నాలజీ వచ్చింది.. ఆదరణ తగ్గింది
సినిమాల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం మారిపోయి.. రంగుల ప్రపంచం రావడం, దానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డూప్‌లకు ప్రాధాన్యం తగ్గింది. ప్రధానంగా డబుల్‌ యాక్షన్‌ సినిమాల విషయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒకే హీరోను ఇద్దరిగా చూపిస్తున్నారు. దీంతో డూప్‌ల అవసరం తగ్గుతూ వచ్చింది. అలాగే సాహసోపేత సన్నివేశాలను గతంలో డూప్‌లతో చిత్రించేవారు. అయితే ఇప్పుడు పూర్తిగా గ్రాఫిక్స్‌ టెక్నాలజీ రావడంతో అలాంటి వారికీ అవకాశాలు తగ్గిపోయాయి. చాలా సినిమాల్లో ఇప్పుడు గ్రాఫిక్స్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దీంతో డూపులకు చాలా మేరకు అవకాశాలు లేకుండా పోయాయి.

అక్కినేనితోఅనుబంధం..   
అక్కినేని నాగేశ్వరరావుకి డూప్‌గా చాలాసార్లు చేశాను. ఓ సినిమాలో అయితే 10 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. రోజుకు రూ.400 చెల్లించారు. అక్కినేని నటించిన చివరి సినిమా ‘మనం’లోనూ ఆయనకు డూప్‌గా చేసినందుకు ఆనందంగా ఉంది. 
మూర్తి, ఏఎన్నార్‌ డూప్‌  

అవకాశాల్లేవ్‌...
అప్పట్లో డూప్‌లకు చాలా అవకాశాలు ఉండేవి. కానీ టెక్నాలజీ మారడంతో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. సినిమాల్లో డూప్‌లతో చేయించేందుకు ఆసక్తి చూపడం లేదు. అవసరమైతే టెక్నాలజీ ద్వారా ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారు. నేను 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో స్టేజీ షోల్లో బాలకృష్ణ గారిలా అందరినీ అలరించాను. ‘ఆట’ సినిమాలో బాలయ్య వేషం వేశాను. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాను.  
– దివాకర్, బాలకృష్ణ డూప్‌  

ప్రేమతో ప్రజల్లోకి...
మా నాన్న సూపర్‌స్టార్‌ కృష్ణ దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. అలా సినీ పరిశ్రమపై ప్రేమ పెరిగింది. దీనికి తోడు పవన్‌కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనలా వేషం వేసేవాడిని. ఈ క్రమంలో ‘అంతర్వేది టు
అమలాపురం టైటానిక్‌ షిప్‌’ పేరుతోఈ మధ్య విడుదలైన సినిమాలో గబ్బర్‌ సింగ్‌ వేషం వేశాను. అలాగే చాలా స్టేజీ షోల్లో పాల్గొన్నాను. హీరోలపై ప్రేమతో మేము ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల ఆదరాభిమానాలు పొందగల్గుతున్నాం.  
– బాబీ, పవన్‌కల్యాణ్‌ డూప్‌

సెలవుపై వెళ్లి... డూప్‌గా మారి  
నేను కాకినాడ నగర పాలక సంస్థలో ఉద్యోగం చేసేవాడిని. సినిమాలంటే చాలా ఇష్టం. మోహన్‌బాబు సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయనలా డైలాగులు చెప్పడం, హావభావాలు పలికించడంతో అచ్చం మోహన్‌బాబులా చేస్తున్నానని అనేవారు. దీంతో నన్ను నేను మోహన్‌బాబులా మార్చుకున్నాను. ఉద్యోగానికి సెలవు పెట్టి, సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అలా చెన్నైలో మోహన్‌బాబును కలుసుకున్నాను. ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. రెండు, మూడు సినిమాల్లో డూప్‌గా మోహన్‌బాబు అవకాశం కల్పించారు. ఇక ఆయన కుమార్తె మంచు లక్ష్మీ తాను నిర్వహించిన ‘లక్ష్మీ టాక్‌ షో’ ద్వారా నన్ను మోహన్‌బాబు డూప్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ మరిచిపోలేని సంఘటనలు. 
– చావలివిశ్వేశ్వర్‌రావు, మోహన్‌బాబు డూప్‌ 

>
మరిన్ని వార్తలు