అవును.. అతడిని ప్రేమిస్తున్నా: కృతి కర్బందా

19 Nov, 2019 10:17 IST|Sakshi

ముంబై : తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని హీరోయిన్‌ కృతి కర్బందా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో దాయాల్సిందేమీ లేదని.. తన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసునని పేర్కొన్నారు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన కృతి... బోణీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్కినేని మనుమడు సుమంత్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కృతికి సక్సెస్‌ ఇవ్వకపోయినా... కన్నడ, తమిళ సినిమాల్లో నటించే అవకాశం మాత్రం కల్పించింది. ఇక పవన్‌ కల్యాణ్‌తో కలిసి తీన్‌మార్‌ మూవీలో నటించే అవకాశం వచ్చినా.. ఆ సినిమా కూడా నిరాశపరచడంతో కృతి పూర్తిగా సాండల్‌వుడ్‌కే పరిమతమైపోయింది. ఇక రామ్‌చరణ్‌ బ్రూస్‌లీ సినిమాలో అతడికి సోదరిగా నటించిన తర్వాత కృతి.. తెలుగు తెరకు దాదాపు దూరమైపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్‌పై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ.. అక్షయ్ కుమార్‌ హౌజ్‌ఫుల్‌ 4 సినిమాతో కెరీర్‌లో తొలిసారి భారీ హిట్‌ అందుకుంది. అదే జోష్‌లో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది.

ఈ క్రమంలోనే పాగల్‌పంతీ సినిమాకు సైన్‌ చేసింది. ఇందులో హీరోగా నటిస్తున్న పులకిత్‌ సామ్రాట్‌తో కృతి ప్రేమలో ఉందంటూ బీ-టౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అతడితో కలిసి పార్టీలకు హాజరవుతూ.. పాపరాజీలకు పనికల్పించిన కృతి.. ఇంతవరకు ఈ విషయంపై నోరు మాత్రం మెదపలేదు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని కన్‌ఫాం చేసింది. ‘ మేమిద్దరం జంటగా బాగుంటాం గనుక మా గురించి ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. మీరు అనుకుంటున్నట్లుగా అవి రూమర్లు కాదు. నిజమే నేను సామ్రాట్‌తో ప్రేమలో ఉన్నాను. ఒక వ్యక్తి నచ్చడానికి ఐదేళ్లు పట్టొచ్చు లేదా పదేళ్లు పట్టొచ్చు. కానీ అంకిత్‌ ఐదు నెలల్లోనే నాకు పూర్తిగా అర్థమయ్యాడు. తనతో మాట్లాడటం నాకెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. తన మీద ఉన్న నమ్మకంతోనే మీతో నా ప్రేమ విషయాన్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు నాకెంతో మనశ్శాంతిగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. కాగా వీరిద్దరు గతంలో వీరే దీ వెడ్డింగ్‌ సినిమాలోనూ కలిసి నటించారు. ఇక పులకిత్‌ సామ్రాట్‌కు గతంలోనే పెళ్లైంది. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ రాఖీ సిస్టర్‌ శ్వేతా రోహిరాను అతడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం మనస్పర్థలతో వాళ్లిద్దరూ విడిపోయారు.

మరిన్ని వార్తలు