1... 2... 3... 4

8 May, 2015 00:39 IST|Sakshi

 ఆ రోజు చక్కగా ముస్తాబై కృతీ సనన్ షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టారు. అది తెలుగు సినిమా షూటింగ్ కాబట్టి, అన్నీ తెలుగు మాటలే. కృతికి ఏమీ అర్థం కాలేదు. డైలాగ్ పేపర్లో ఉన్న సంభాషణలు చెబుతూ, నటించాలి. నోరు తిరగలేదు. దాంతో, ‘1, 2, 3, 4’ అని అంకెలు చెబుతూ నటించమంటూ యూనిట్ సభ్యులు సలహా ఇచ్చారు. కృతి అలానే చేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘1.. నేనొక్కడినే’ సమయంలో కూడా ఇలా ‘అంకెలే నాకు సంభాషణలు’ అని కృతి చెప్పారు.

 కానీ, ఇప్పుడు అంకెలు చెప్పడం మానేశానని కృతీ సనన్ అంటూ -‘‘ఇలా అంకెలు చెప్పడం వల్ల డబ్బింగ్‌లో లిప్ సింక్ కాదనే విషయం అర్థమైంది. అందుకే, డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి ఇబ్బంది లేకుండా నేను నటిస్తున్నప్పుడే తెలుగు సంభాషణలు పలికితే బాగుంటుందనుకున్నా. అప్పటి నుంచీ ఆ సంభాషణలను కష్టపడి బట్టీపట్టి చెబుతున్నా. దాంతో డబ్బింగ్ కరెక్ట్‌గా కుదురుతోంది. అలాగే, ఆ సంభాషణలకు అర్థం తెలుసుకోవడం వల్ల, అందుకు తగ్గ హవభావాలు కనబరచగలుగుతున్నా. త్వరలో తెలుగు మాట్లాడడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు.