మీరా చోప్రా ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం

6 Jun, 2020 10:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో హీరోయిన్‌ మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమెను ఎక్కువగా ట్రోల్‌ చేస్తున్న 15 ట్విటర్‌ హ్యాండిల్స్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆ అకౌంట్లను ఉపయోగిస్తున్న సభ్యులకు నోటీసులు పంపించారు. అంతేకాకుండా అసభ్యకర ట్వీట్లు చేసిన ఆ 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా తనను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని మీరా చోప్రా హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు న‌మోదు)

తాజాగా మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కవితకు ట్విటర్‌ వేదికగా ఈ నటి ఫిర్యాదు చేశారు. ‘మీ రాష్ట్రానికి చెందిన కొందరు నాపై సామూహిత అత్యాచారం, యాసిడ్‌ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా వేధిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. మహిళలకు రక్షణ కల్పిస్తారని, దీనిపై విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా’ అంటూ కేటీఆర్‌, కవితలకు మీరా చోప్రా ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తనను అసభ్యపదజాలంతో దూషిస్తూ చేసిన ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను కూడా జతచేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ‘మేడమ్‌ మీరిచ్చిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్‌శాఖను కోరాను’ అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్‌ స్పందనపై ఆనందం వ్యక్తం చేసిన మీరా చోప్రా మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదని మరోసారి విజ్ఞప్తి చేశారు. (మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మీరాచోప్రా)

ఇంతకీ ఏం జరిగిందంటే..
సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే మీరా చోప్రా ఇటీవల ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్‌ చిన్మయి శ్రీపాదతో పాటు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ రేఖా శ‌ర్మ మీరా చోప్రాకు అండగా నిలిచారు. (ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న నటుడు)

మరిన్ని వార్తలు