మంత్రి కేటీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మీరాచోప్రా

5 Jun, 2020 17:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గత నాలుగైదు రోజులుగా మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై మీరాచోప్రా మరోసారి మంత్రి కేటీఆర్‌, కవితకు ట్విటర్‌ ద్వారా ట్వీట్‌ చేశారు. ' నన్ను గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని, యాసిడ్‌ దాడి చేస్తామంటూ బూతులు తిడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. ఇప్పటికే హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కు ఫిర్యాదు చేశాను. మహిళలకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా' అంటూ తెలిపారు (ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై హీరోయిన్‌ మీరా ఫిర్యాదు)

కాగా దీనిపై కేటీఆర్‌  వెంటనే స్పందించారు.' మేడం.. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. మీ ఫిర్యాదు ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీకి ఆదేశించాను.' అంటూ తెలిపారు. కేటీఆర్‌ ట్వీట్‌కు మీరాచోప్రా రీట్వీట్‌ చేస్తూ..'థ్యాంక్యూ కేటీఆర్‌ సార్‌.. మహిళల భద్రతకు ఇది చాలా ముఖ్యం. మహిళలపై నేరాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను స్వేచ్ఛగా ఉంచకూడదు!' అంటూ పేర్కొన్నారు. మీరా చోప్రా ట్వీట్ల ఆధారంగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ట్విటర్‌లో చేసిన అసభ్యకరమైన ట్వీట్లను పోలీసులు తొలగించారు. అసభ్యంగా కామెంట్స్ చేసిన వారి ట్విటర్ అకౌంట్స్ ని గుర్తించి వారిపై 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇకపై ట్విటర్‌లో అసభ్యంగా ఉన్న పోస్టులను షేర్ చేసినా, వాటిపై కామెంట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలుసులు పేర్కొన్నారు.

అసలు ఏం జరిగిందంటే..
జూన్‌ 1న మీరా చోప్రా ఇటీవల ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి అని కోరారు. అయితే ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పడంతో మీరా చోప్రాపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర ట్వీట్లు చేశారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. దీంతో అసహనానికి లోనైన ఈ నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమెకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. సింగర్‌ చిన్మయి శ్రీపాద మీరా చోప్రాకు అండగా నిలిచారు.

మరిన్ని వార్తలు