నన్నెందుకు నిందిస్తున్నారు: నటుడి భార్య

6 Jan, 2020 10:45 IST|Sakshi

ముంబై: తన భర్త ఆత్మహత్యకు తనను బాధ్యురాలిని చేయడం భావ్యం కాదని నటుడు కుశాల్‌ పంజాబీ భార్య అడ్రే డోలెన్‌ అన్నారు. కుశాల్‌తో తనకు అభిప్రాయ భేదాలు తలెత్తిన మాట వాస్తవేమనని... అయితే తన కారణంగా అతడు చనిపోలేదని పేర్కొన్నారు. బాలీవుడ్‌ నటుడు కుశాల్‌ పంజాబీ బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌ రాసిన కుశాల్‌.. తన ఆస్తిని తల్లిదండ్రులు, తన కొడుకు కియాన్‌కు సమానంగా పంచాలని లేఖలో కోరాడు. అయితే కుశాల్‌ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడి మృతికి కోడలి వేధింపులే కారణమని ఆరోపించారు. కియాన్‌ను కుశాల్‌కు దూరం చేసిందని.. తరచూ డబ్బులు ఇవ్వాలంటూ వేధించినందు వల్లే కుశాల్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణలపై స్పందించిన డోలెన్‌... ‘మా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి. అయితే మేం విడిపోవాలని అనుకోలేదు. కియాన్‌ను తన తండ్రి దగ్గరికి వెళ్లకుండా నేను ఏనాడు అడ్డుపడలేదు. నిజానికి కుశాల్‌కు బంధాలపై ఆసక్తి లేదు. నన్ను, నా కొడుకును ఏనాడు లెక్కచేయలేదు. ప్రస్తుతం నేను షాంఘై(చైనా)లో ఉద్యోగం చేస్తున్నాను. చెప్పాలంటే కుశాల్‌ ఖర్చులు కూడా నేనే భరిస్తున్నా. అపార్థాలు తొలగించుకునేందుకు తనను ఇక్కడకు రావాలని కోరాను. కుశాల్‌తో బంధాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ ఇప్పుడు నాపై నిందలు వేస్తున్నారు. ఉద్యోగరీత్యా నేను షాంఘైలో ఉండటం కుశాల్‌కు ఇష్టం లేదు. లండన్‌కు షిఫ్ట్‌ అవుదామన్నాడు. కానీ జాబ్‌ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కొడుకు భవిష్యత్తు గురించి శ్రద్ధలేని కుశాల్‌ను నమ్మాలనుకోలేదు. నేను, కియాన్‌ క్రిస్‌మస్‌ సెలవుల కోసం ఫ్రాన్స్‌లో ఉన్నపుడు ఇలా జరిగింది’ అని వివరణ ఇచ్చారు.
(‘నా చావుకు ఎవరూ కారణం కాదు’  )

కాగా ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా తదితర రియాలిటీ షోల్లో పాల్గొన్న కుశాల్‌ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫర్హాన్‌ అక్తర్‌ లక్ష్యా, కరణ్‌ జోహార్‌ కాల్‌ సినిమాలతో వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతడికి 2015లో డోలెన్‌తో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు కియాన్‌ ఉన్నాడు. ఇక డిసెంబరు 26న కుశాల్‌ ఆత్మహత్యకు పాల్పడిన క్రమంలో విచారణకు హాజరుకావాలంటూ డోలెన్‌కు పోలీసులు నోటీసులు పంపించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా