ఈ ప్రపంచాన్ని మార్చింది వారే!

12 Dec, 2016 15:18 IST|Sakshi
ఈ ప్రపంచాన్ని మార్చింది వారే!

ఈ ప్రపంచాన్ని మార్చిన వారిలో పలువురు మధ్య బెంచ్ విద్యార్థులేనని దర్శకుడు సీజే.జ్ఞానవేల్ పేర్కొన్నారు. నటుడు సూర్య అగరం ఫౌండేషన్‌లో ముఖ్య నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం కూటత్తిల్ ఒరుత్తన్. అశోక్ సెల్వన్, ప్రియాఆనంద్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్‌ఆర్. ప్రకాశ్, ఎస్‌ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక సత్యం సినిమా హాల్‌లో జరిగింది.

చిత్ర ఆడియోను సీనియర్ నటుడు శివకుమార్ సమక్షంలో నటుడు సూర్య ఆవిష్కరించగా నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్ తొలి సీడీని అందుకున్నారు. ఈ సందర్భంగా  సూర్య మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ నిరంతర శ్రమజీవి అని పేర్కొన్నారు. తన అగరం ఫౌండేషన్‌కు పేరును పెట్టింది ఈయనేనని తెలిపారు. ఈ ఫౌండేషన్ విజయంలో ఆయన పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు. తనకు నటుడిని దాటి మంచి పేరు రావడానికి కారణం కూడా జ్ఞానవేలేనని నటుడు సూర్య చెప్పారు. అనంతరం చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ మాట్లాడుతూ తాను పత్రికారంగం నుంచి వచ్చానని.. అందులో గడించిన అనుభవమే ఈ చిత్రం అని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కథకు స్ఫూర్తి నటుడు కార్తీనేనని ఆయన తెలిపారు.

తాను ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా తాను తన కుటుంబంలో మధ్యముడిగా పుట్టడం వల్ల ఎవరూ తనను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారన్నారు. అన్నయ్య పెద్దవాడు కావడంతో అమ్మకు ఆయనంటే ప్రేమ అని, అందరి కంటే చిన్నది కావడంతో చెల్లెలంటే నాన్నకు ప్రేమ అని చెప్పారన్నారు. ఆయన చెప్పిన విషయాలనే ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ఈ కూటత్తిల్ ఒరుత్తన్ అని దర్శకుడు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప వారంతా మధ్య బెంచ్‌లో కూర్చునే వాళ్లేనని, అరుుతే వారిని మనం పెద్దగా గుర్తించడం లేదని దర్శకుడు జ్ఞానవేల్ అన్నారు.