‘హీరో’యిన్‌

4 Mar, 2018 10:21 IST|Sakshi

భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎంత కామనో.. తెలుగు సినిమా హీరోల చుట్టూ తిరగడం అంతే కామన్. కానీ ఈ ఫార్ములాను బ్రేక్‌ చేసిన తారలు కూడా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. హీరోల చుట్టూ పరిగెడుతున్న కథా కథనాలు ఒక్క సినిమాతో తమవైపుకు తిప్పుకొని చూపించారు కొంత మంది తారలు. అలాంటి మహిళామణులు మనకు ప్రతి జనరేషన్‌లోనూ కనిపిస్తారు.

ఎప్పుడూ కథానాయకుల చుట్టూ తిరిగే తెలుగు సినిమా కథ అప్పుడప్పుడు హీరోయిన్ల వైపు కూడా తిరుగుతుంది. కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్‌ అంటే నాలుగు పాటలు, మరో నాలుగు సీన్స్‌కు మాత్రమే అంటూ అంటూ ఫిక్స్ అయిపోయిన రైటర్లు హీరోయిన్‌కి హీరో రేంజ్ కాన్వాసు ఇచ్చిన సందర‍్భాలు కూడా ఉన్నాయి. కేవలం హీరోతో ఆడి పాడే హీరోయిన్‌లు తామే లీడ్‌ రోల్స్‌గా మారి కథ నడిపిస్తే.. ఆ ఆలోచనతో సినిమాలు తెరకెక్కించిన దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు.

హీరోయిన్లకు హీరోయిజం చూపించే ట్రెండ్‌ కొత్తగా వచ్చిందేం కాదు.. సినిమా పుట్టిన దగ్గరనుంచి ఈ ట్రెండ్‌ ఉంది. భానుమతి, అంజలీ దేవిల నుంచి సూర్యకాంతం లాంటి నటీమణుల వరకు ఎందరో.. ఎన్నో అద్భుత చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌ లో నటించారు. ఆయా సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేసిన ఆర్టిస్ట్‌ లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటి భానుమతి. మల్టీ టాలెంటెడ్‌  స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ మహానటి ఎన్నో అద్భుత చిత్రాల్లో అంతా తానే అయి సినిమాలను విజయతీరాలకు చేర్చారు. భానుమతి తరువాత అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మరోనటి సూర్యకాంతం. హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేయకపోయిన సినిమా అంతా తన చూట్టూ నడిచే ఎన్నో సినిమాలతో లేడీ క్యారెక్టర్‌కు హీరోయిజాన్ని ఆపాదించింది. అలాంటి ఓ సూపర్‌ హిట్‌ చిత్రమే గుండమ్మ కథ.

కలర్‌ సినిమాలు వెండితెర మీదకు వస్తున్న రోజుల్లో కూడా ఎంతో మంది హీరోయిన్లు లేడిఓరియంటెడ్‌ సినిమాలతో వెండితెరకు కొత్త అందాలను తీసుకువచ్చారు. అందం అభినయంతో పాటు కాస్త డైనమిజాన్ని కూడా చూపించారు. అందాల తారలుగా పేరు తెచ్చుకున్న జయప్రద, శారద, భానుప్రియ, జయసుధ లాంటి వారు కూడా లేడీ ఓరియంటెండ్ సినిమాలతో మెప్పించారు. సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా తన అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన శ్రీదేవి కూడా అప్పుడప్పుడు గ్లామర్‌ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఛాలెంజింగ్‌ రోల్స్‌తో సత్తా చాటింది. కెరీర్‌ తొలినాళ్లలోనే పదహరేళ్ల వయసు, వసంత కోకిల లాంటి విభిన్న చిత్రాలతో అలరించారు. 

హీరోయిన్‌ అంటే హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించిన మరో నటి విజయశాంతి. చాలా కాలం గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన విజయశాంతి, తరువాత లేడీ ఓరియంటెండ్‌ సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రతిఘటన, భారతనారి, కర్తవ్యం, రేపటి పౌరులు, ఒసెయ్‌ రాములమ్మ లాంటి సినిమాలు ఘనవిజయం సాధించటంతో సౌత్ ఇండియా లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఈ జనరేషన్‌ లోనూ లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసిన నటీమణులకు కొదవేం లేదు. అనుష్క, నయనతార లాంటి తారలు యాక్షన్, థ్రిల్లర్ తరహా సినిమాలతో లేడీ ఓరియంటెండ్ సినిమాల హవాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా అప్పుడప్పుడు మహిళలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు రూపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు