ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

23 May, 2019 02:11 IST|Sakshi
లగడపాటి శ్రీధర్‌

‘‘సాధారణంగా స్టార్స్‌ ఉన్న సినిమాలైతే ముందు వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత సినిమాకి వెళతారు. కానీ, ‘ఎవడు తక్కువ కాదు’లో స్టార్స్‌ లేరు. కథే స్టార్‌. ముందు మాట్లాడుకుని తర్వాత చూసే సినిమా కాదిది. సినిమా చూశాక దాని గురించి మాట్లాడుకునేలా ఉంటుంది’’ అన్నారు లగడపాటి శ్రీధర్‌. ‘రేసుగుర్రం, పటాస్, రుద్రమదేవి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్‌ సహిదేవ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. తమిళ ‘గోలీ సోడా’ సినిమాకి ఇది రీమేక్‌. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీషా సమర్పణలో లగడపాటి శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. లగడపాటి శ్రీధర్‌ చెప్పిన విశేషాలు.

► టీనేజ్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఎవడు తక్కువ కాదు’. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో తమిళంలో రూ. 2 కోట్లతో తీసిన ‘గోలీ సోడా’ సినిమా రూ. 20కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో, మంచి ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో రిచ్‌గా తీశాం.

► ‘గోలీ సోడా’ చిత్రానికి హీరోయిన్‌ సమంత పెద్ద అభిమాని. కథ అంత బాగుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు చేశాం. టీనేజర్స్‌ నేపథ్యంలో తెలుగులో ఈ మధ్య మంచి సినిమా రాలేదు. ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది. 

► యూత్‌లో ఎవడూ తక్కువ కాదు. వారికి ఎన్నో కలలు ఉంటాయి. వాటిని ఎలా సాధించొచ్చు? సాధించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? అని మా సినిమాలో చెప్పాం.  క్లైమాక్స్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. 

► వేసవికి కావాల్సిన మాస్‌ యూత్‌ఫుల్‌ ఫిల్మ్‌. ఓవర్‌సీస్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేయలేదు. ఇక్కడ స్పందనను బట్టి రిలీజ్‌ చేద్దామనుకుంటున్నాం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకి విక్రమ్‌కి ఎంత పేరొచ్చిందో ఈ సినిమాతో అంతకుమించి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించా.. చాలా సంతోషంగా అన్ని ఏరియాల వాళ్లు కొనుక్కోవడం బిగ్గెస్ట్‌ సక్సెస్‌.

మరిన్ని వార్తలు