లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సన్నివేశాలపై వివరణ ఇచ్చా: రాకేష్‌ రెడ్డి

25 Mar, 2019 13:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని సన్నివేశాలను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వివరించామని ఆ చిత్ర నిర్మాత రాకేష్‌ రెడ్డి తెలిపారు. తన వివరణపై సీఈవో ద్వివేది సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. దివంగత ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం, వాస్తవ పరిస్థితుల ఆధారంగా సినిమా తీశామన‍్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా...రాజకీయ పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా తీశారన్న ఆరోపణలల్లో వాస్తవం లేదన్నారు. పసుపు జెండాలను తప్ప, పార్టీలను చూపించలేదన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామన్నారు. సెన్సార్స్‌ క్లియరెన్స్‌ కూడా వచ్చిందని నిర్మాత రాకేష్‌ రెడ్డి తెలిపారు.

ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం ఉందంటూ ఈసీకి ఫిర్యాదులు అందటం, చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిర్మాత రాకేష్‌ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు (సోమవారం) ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే అంతకు ముందు రాకేష్‌ రెడ్డి తనకు వచ్చిన నోటీసులపై వాట్సాప్‌ ద్వారా సమాధానం ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన ఈసీ... వ్యక్తిగతంగా కమిటీ ఎదుట హాజురు కావాలని స్పష్టం చేసింది. దీంతో రాకేశ్‌ రెడ్డి ఈసీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు