అజ్ఞాతవాసికి మరిన్ని కష్టాలు.. లీగల్‌ నోటీసులు

19 Jan, 2018 10:53 IST|Sakshi

సాక్షి, సినిమా : పవన్‌ కళ్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి చిత్ర కథ ‘కాపీ వివాదం’ మరో మలుపు తీసుకుంది. చిత్ర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు మాతృక చిత్రం లార్గో వించ్‌(ఫ్రెంచ్‌) దర్శకుడు జెరోమ్‌ సల్లే సిద్ధమైపోయారు. ఈ మేరకు తన ట్విటర్‌లో ఆయన సంకేతాలు అందించారు. 

‘‘వారం గడిచినా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్‌ మౌనంగా ఉండటం బాగోలేదు. ఇక చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మిగిలింది లీగల్‌ నోటీసులు పంపటం ’’ అంటూ ఆయన పేర్కొన్నారు. 

ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' చిత్రానికి అజ్ఞాతవాసి కాపీ అనే ప్రచారం జరిగిన సమయంలో... ఇండియాలో రీమేక్ హక్కులను దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపటంతో.. చివరకు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఆ వెంటనే తెర పైకి వచ్చిన లార్గొ వించే దర్శకుడు జెరోమ్‌ సల్లే చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ తన కథనాన్ని యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా దించేశాడని సినిమా చూశాక సల్లే వ్యాఖ్యానించటం విశేషం. 

కొద్దిరోజుల క్రితం ఆయన మరో ట్వీట్‌ చేశారు. ‘‘సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదేమో?’’  అంటూ మరో ట్వీట్‌ చేసి చర్యలకు సిద్ధమౌతున్నట్లు సంకేతాలు అందించారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ నుంచి స్పందన లేకపోవటంతో ఆయన లీగల్‌ నోటీసులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నెగటివ్‌ టాక్‌తో ఇప్పటికే ఈ చిత్రానికి భారీ డ్యామేజ్‌ కాగా, ఇప్పుడు న్యాయపరమైన చిక్కులతో మరో దెబ్బ తగలబోతోంది.

మరిన్ని వార్తలు