వామ్మో అంటే అందరూ అదోలా చూశారు!

7 Aug, 2016 23:46 IST|Sakshi
వామ్మో అంటే అందరూ అదోలా చూశారు!
‘‘మొన్నామధ్య ఇంటికి వెళ్లినప్పుడు.. మాటల మధ్యలో నటుడు రఘుబాబు స్టైల్‌లో ‘వామ్మో’ అన్నాను. ఒక క్షణం అందరూ నావంక అదోలా చూశారు. బ్రెజిల్‌లో కూడా తెలుగు మాట్లాడుతున్నానంటే ఈ సినిమా, భాష నాకు ఎంత దగ్గరైందో అర్థం చేసుకోండి’’ అంటున్నారు బ్రెజిలియన్ భామ లారిస్సా బోనెసి. సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రోహిణ్ రెడ్డి నిర్మించిన సినిమా ‘తిక్క’. పలు కమర్షియల్ యాడ్స్, ‘గో గోవా గాన్’ వంటి హిందీ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన లారిస్సా బోనెసి ‘తిక్క’తో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 
 
ఈ నెల 13న విడుదలవుతున్న ఈ సినిమా గురించి లారిస్సా మాట్లాడుతూ - ‘‘ఐపీయల్‌లో నా యాడ్ చూసిన రోహిణ్ రెడ్డి హీరోయిన్ అంజలి పాత్రలో నటించమని అడిగారు. లవ్లీ, ఎమోషనల్, సెన్సిటివ్ అమ్మాయి. రియల్ లైఫ్‌లో నా క్యారెక్టర్‌కు కాస్త దగ్గరగా ఉంటుంది. సినిమాలో రఘుబాబుతో చిన్న ఫైట్ కూడా చేశాను. షూటింగ్ మొదలవ్వక ముందు తెలుగు ట్యూషన్‌కి వెళ్లాను. మా టీచర్ నన్ను కాఫీ షాపులు, షాపింగ్‌లకు తీసుకు వెళ్లింది. 
 
ఈ క్రమంలో తెలుగమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారో? నవ్వుతారో? బాధపడతారో? అర్థమైంది. దాంతో పాత్రలో నటించడం సులభమైంది. షూటింగ్‌లో డైలాగులు మర్చిపోతే సాయిధరమ్ తేజ్ హెల్ప్ చేసేవాడు. తెలుగు అర్థమవుతుంది కానీ, ఇంకా మాట్లాడడం రాలేదు. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉంది. మహేశ్‌బాబు, ప్రభాస్‌లతో నటించాలనుంది’’ అన్నారు.