ఆఖరి పాట

7 Dec, 2018 03:21 IST|Sakshi

అసత్య

గత రెండు వారాలుగా లతామంగేష్కర్‌కి సంబంధించిన ఒక అసత్య వార్త వాట్సాప్‌లో  మనోవేగంతో ప్రయాణిస్తోంది. లతామంగేష్కర్‌ తొంభయ్యవ సంవత్సరంలోకి అడుగుపెట్టారని, ఆఖరి పాటను రికార్డు చేస్తున్నారన్నది ఒక వార్త కాగా.. ఇప్పటికే ఆ చివరి పాట చాలాచోట్ల వినిపిస్తోందని మరో వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ బయటికి వచ్చిన పాట ‘తాను ఇంక విశ్రాంతి తీసుకుంటాను’ అనే అర్థంలో ఉందనీ అంటున్నారు. దీంతో లతా అభిమానులు, ఆరాధకులు ఏకధాటిగా రోదించడం, గుండెలు బాదుకోవడం ప్రారంభించారు.

‘సంగీత స్వర్ణ యుగం ముగిసిపోతోంది’ అంటూ బరువెక్కిన గుండెలతో సందేశాలు కూడా పంపడం మొదలుపెట్టారు. లతామంగేష్కర్‌ ఇంకా తొంభయ్యవ వసంతంలోకి అడుగుపెట్టలేదు. ‘‘వచ్చే ఏడాది సెప్టెంబరు మాసంలో ఆవిడ తొంభైలోకి వస్తారని, ‘ఆఖరి పాట’గా వినిపిస్తున్న పాట ఇటీవల రికార్డు అయినది కాదని కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. వారిలో ఒకరైన పవన్‌ ఝా అనే జైపూర్‌ సంగీత విద్వాంసుడు, తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఇందుకు సంబంధించిన విషయం పోస్టు చేశారు.

నవంబరు చివరి వారంలో లతకు సంబంధించిన అనేక అసత్య సందేశాలు తనకు కూడా వచ్చాయని, ఆఖరి పాట అని చెబుతున్న ‘క్షణ అమృతాచే’ అనే మరాఠీ ఆల్బమ్‌ కోసం 2013లో రికార్డు చేశారని ఆయన పోస్టు పెట్టారు. ఆ తర్వాతి ఏడాది ఎ.ఆర్‌.రెహమాన్‌ చేసిన ‘రౌనాక్‌’ అనే ఆల్బమ్‌ కోసం ఒక పాట, బైజు మంగేష్కర్‌ సంగీతంలో ‘యా రబ్బా’ అనే పాట, నిఖిల్‌ కామత్‌ స్వరపరచిన ‘డున్నో వై2’ (2015) పాటలను లత పాడినట్లు ఝా చెబుతున్నారు. అనారోగ్యం కారణంగా లత గత రెండు సంవత్సరాలుగా పాటలకు దూరంగా ఉన్నారు.

కిందటి సంవత్సరం జనవరి మాసంలో, రామరక్షా స్తోత్రం నుంచి రెండు శ్లోకాలు మాత్రమే మయూరేశ్‌ పాయ్‌ సంగీత పర్యవేక్షణలో పాడారు. ఒక సెలబ్రిటీ గురించి అసత్యాలు వైరల్‌ కావడం కొత్తేమీ కాదు. లత కంటే ముందు ఇంకా చాలామంది ఇటువంటి చేదును చవిచూశారు. అర్థంపర్థం లేని కవిత్వం రాసి అది గుల్జార్‌ రచించినట్లుగా ప్రచారం జరిగింది. అమితాబ్‌ బచ్చన్, సొనాలీ బింద్రే, ఫరీదా జలాల్, తెలుగు నటి జయంతి... వంటి సెలబ్రిటీలు చనిపోయినట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి.
– జయంతి
 

మరిన్ని వార్తలు