నా లెక్క నాకుంది!

23 Jan, 2016 23:54 IST|Sakshi
నా లెక్క నాకుంది!

అందాల రాక్షసి అనిపించుకోవడంతో పాటు అభినయంలోనూ రాక్షసి అనిపించుకున్నారు లావణ్యా త్రిపాఠీ. గ్లామరస్ క్యారెక్టర్స్ మీద మాత్రమే ఆధారపడకుండా... నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, దూసుకెళుతున్నారు. ఆమె నటించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఈ నెల 29న విడుదల కానుంది. నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ జంటగా జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని ఈ చిత్రం నిర్మించారు. ఇక... లావణ్య చెప్పిన ముచ్చట్లు తెలుసుకుందాం...

‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ క్రైమ్ కామెడీ మూవీ. ఇందులో నేను మల్టిపుల్ పర్సనాల్టీ డిజార్డర్ ఉన్న అమ్మాయిగా చేశా. ఈ చిత్రం ఒప్పుకోవడానికి అదో కారణం. దేవి, ఉమాదేవి, అంకాళమ్మ.. నాలో కనిపించే మూడు షేడ్స్ తాలూకు పాత్రల పేర్లివి. దేవి క్రేజీ గాళ్. చాలా ఫన్నీగా ఉంటుంది. ఉమాదేవి బిడియస్తురాలు. తన ప్రవర్తన నవ్వు తెప్పిస్తుంది. అంకాళమ్మ దేవత పాత్ర. ఈ మూడు షేడ్స్‌కీ శారీరక భాష, నటన పరంగా వ్యత్యాసంగా చూపించడానికి చాలా కృషి చేశాను. నాకు సవాల్‌గా అనిపించలేదు. ఎంజాయ్ చేశాను.

అంకాళమ్మ పాత్రకు బరువైన చీరలు కట్టుకోవాల్సి వచ్చింది. బరువైన నగలు పెట్టుకోవాల్సి వచ్చింది. మెడలో నిమ్మ కాయల దండ, చేతిలో త్రిశూలం.. చాలా బరువైన పాత్ర అన్న మాట. ఇవన్నీ పెట్టుకుని బీభత్సంగా డ్యాన్స్ కూడా చేయాలి. హుషారుగా చేశాను. కానీ, నగల బరువుకి మెడ మీద గాట్లు పడ్డాయి. తలకి పెట్టుకున్న కిరీటం కూడా తన వంతుగా కొన్ని ఆనవాళ్లు మిగిల్చింది. నెక్, బ్యాక్ పెయిన్‌తో కొంచెం ఇబ్బందిపడ్డా. కానీ, అది కూడా ఆనందంగానే అనిపించింది.

దర్శకుడు జగదీశ్ తలశిలకు చాలా అనుభవం ఉంది. మూడు షేడ్స్‌ని బాగా చేయగలిగానంటే ఆయనే కారణం. కథ ఎంత క్లియర్‌గా చెప్పారో, ఎలా నటించాలో కూడా అంతే స్పష్టంగా చెప్పారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా తీశారు. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అవకాశం రావడం నా లక్.

నా మొదటి చిత్రంలో నవీన్ చంద్రతో కలిసి నటించాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఓ తమిళ సినిమా చేశాం. ఇది మూడో సినిమా. ఇందులో మేమిద్దరం టామ్ అండ్ జెర్రీలా గొడవపడుతుంటాం. అక్కడక్కడా రొమాన్స్ ఉంటుంది.

‘లచ్చిందేవికి లెక్కుంది’ డబ్బు చుట్టూ తిరుగు తుంది. రియల్ లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా హ్యాపీగా ఉన్నాను. మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆనందంగానే ఉండేదాన్ని. ఎలా ఉన్నా ఆనందంగా ఉండటం మా అమ్మానాన్న నేర్పిం చారు. డబ్బు కోసం నేనేదీ చేయను. మోడల్‌గా చేసేటప్పుడు కూడా ఏది పడితే అది చేయలేదు. సినిమాలు కూడా అంతే. ఏ సినిమా చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయంలో నా లెక్క నాకుంది. ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా, కథ నచ్చక వదులుకున్న సినిమాలు ఉన్నాయి.

అల్లు శిరీష్ సరసన నటిస్తున్న చిత్రం మరో రెండు నెలల్లో రిలీజ్ అవుతుంది. ఇందులో కాలేజ్ గాళ్ పాత్ర చేశాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జునకు తగ్గట్టు మెచ్యూర్డ్‌గా కనిపించడం కోసం కొంచెం బరువు పెరిగాను. ఆ తర్వాత కాలేజ్ గాళ్ పాత్ర కోసం తగ్గాను. మంచి క్యారెక్టర్ అనిపిస్తే ఎంత కష్టం అయినా వెనకాడను. ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడంవల్ల కొంచెం బ్రేక్ తీసుకుని, టూర్ వెళ్లాలనుకుంటున్నా.