హాలీవుడ్ నటుడిపై దేశబహిష్కరణ వేటు!

2 Apr, 2016 15:57 IST|Sakshi

ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు సాధించాడు. లెక్కకు మిక్కిలి సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో అతని ఫాలోవర్ల సంఖ్య 3.6 కోట్ల మందికి పైనే. అన్నింటికి మించి పర్యావరణ పరిరక్షణ కోసం విపరీతంగా పాటుపడతాడు. ఫలానాచోట, ఫలానా కారణం వల్ల వాతావరణం కలుషితం అవుతోందని తెలిస్తేచాలు, స్టార్ డమ్ ను పక్కన పెట్టి ప్రకృతి ప్రేముకులతో కలిసి ఆందోళనకు దిగుతాడు. ప్రకృతి సమతుల్యం కోసం పరితపించే ఆ లక్షణమే హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోను ఇప్పుడు చిక్కుల్లో పడేసింది.  

అమెరికా సహా ప్రపంచ దేశాల్లో చాలా ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేస్తోన్న, చేస్తున్నవారిని ప్రోత్సహిస్తోన్న డికాప్రియో గతవారం ఇండోనేసియాలో పర్యటించాడు. అక్కడి ప్రఖ్యాత గునుంగ్ లేసర్ జాతీయపార్కును సందర్శించిన సందర్భంలో ఇండోనేసియా ప్రభుత్వ తీరుపై ఘాటైన విమర్శలు చేశాడు. దీంతో అక్కడి ప్రభుత్వం డికాప్రియోపై దేశబహిష్కరణ వేటు వేస్తామని హెచ్చరించింది.

దాదాపు 10 లక్షల హెక్టార్లు విస్తరించి ఉన్న గునుంగ్ పార్క్ ప్రపంచ ప్రఖ్యాత ఎకోజోన్లల్లో ఒకటి. అరుదైన వృక్షజాతులు, జంతుజాలానికి నిలయం. సముద్ర మట్టానికి 3వేల అడుగుల ఎత్తులో  రమణీయతతో అలరారే ఆ ప్రాంతంలో పామ్ ఆయిల్ ప్లాంట్లకు అనుమతినివ్వడం ద్వారా విధ్వంసానికి పూనుకుంది  ఇండోనేసియా ప్రభుత్వం. పామ్ ఆయిల్ ప్లాంట్లను ఇటీవల భారీగా విస్తరిస్తోంది కూడా. పామాయిల్ మొక్కల కోసం అడవిని చదునుచేయడంతోపాటు, పంటను నాశనం చేస్తున్నాయనే మిశపై ఒరాంగుటన్(అరుదైన చింపాజీలు)లను విచక్షణా రహితంగా చంపేస్తున్నారు.

వీటన్నింటిపై ఇండోనేసియన్లే కాక ప్రపంచ ప్రపంచ దేశాల్లోని పర్యావరణ ప్రేమికులంతా ఆందోళననలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇండోనేసియాకు వచ్చిన డికాప్రియో ప్రభుత్వం తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో మా దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వమంటూ స్థానిక అధికారులు డికాప్రియోకు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకునేలోపే నటుడు స్వదేశం అమెరికాకు వెళ్లిపోయాడు. గతంలో తమ దేశ అధికారులను వేధించాడనే ఆరోపణలపై నటుడు హారిసన్ ఫోర్డ్ (ఇండియానా జోన్స్, స్టార్ వార్స్ ఫేమ్) ను కూడా దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది ఇండోనేసియా ప్రభుత్వం.