విజయాలు లేని సమయంలో ఒక వెలుగునిచ్చింది..!

11 Apr, 2014 02:10 IST|Sakshi
విజయాలు లేని సమయంలో ఒక వెలుగునిచ్చింది..!

‘‘లెజెండ్’ ఎవరనే విషయంలో కొంతమంది కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారు. అసలైన ‘లెజెండ్’ ఎవరో ఈ సినిమాలో చూపించాం. నా దృష్టిలో నిజమైన ‘లెజెండ్’ మా నాన్నగారు ఎన్టీ రామారావుగారే’’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి  నిర్మించిన ‘లెజెండ్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం  హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘విజయాలు లేని సమయంలో పరిశ్రమకు ఈ సినిమా ఒక వెలుగునిచ్చింది’’ అని చెప్పారు.
 
 పబ్‌లకూ క్లబ్‌లకూ తిరగను!

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ- ‘‘నా కెరీర్‌లో అతితక్కువ సమయంలో రీరికార్డింగ్ చేసిన సినిమా ఇది. 13 రోజులు రాత్రింబవళ్లూ కష్టపడ్డాను’’ అని చెప్పారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘దేవి 13 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తి చేసిన మాట నిజమే. అన్ని రోజులూ నేను  అతన్ని వెంటాడి నిద్రపోనివ్వకుండా చేయించు కున్నాను. ఫైనల్ మిక్సింగ్ కూడా దగ్గరుండి తనతోనే చేయించుకున్నాను...’’ అని ఇంకేదో చెప్పబోతుండగా దేవిశ్రీప్రసాద్ మైక్ అందుకొని ఆ వ్యాఖ్యలకు పాజిటివ్‌గానే స్పందిస్తున్నానని చెబుతూనే ఘాటుగా మాట్లాడారు.
 
‘‘నా బాధ్యతను ఎవ్వరూ గుర్తుచేయనవసరం లేదు. నాకు తెలిసింది సంగీతమే. పిండుకోవడానికి నేనేమన్నా ఆవునా? గేదెనా? నేను పబ్‌లకూ క్లబ్‌లకూ తిరగను. సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫైనల్ మిక్సింగ్‌కి నేను ఉండననడం కరెక్టుకాదు. ఆ 13 రోజుల్లో ఆయన వున్నది మూడు రోజులు మాత్రమే. ఆ మూడు రోజులు కూడా ల్యాప్‌ట్యాప్‌లో ఇంగ్లీషు సినిమాలు చూస్తూ గడిపారు. ఎవరి క్రెడిట్ వాళ్లకు దక్కాల్సిందే అని నమ్మే వ్యక్తిని నేను.
 
అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి ఇది చెప్పడం లేదు’’ అని దేవి స్పందించారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఈలోగా తను తొందరపడి మైక్ లాక్కున్నాడు. దేవి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అని చెప్పారు.