అర్జున్‌ అభిమానుల నుంచి బెదిరింపులు

23 Oct, 2018 08:59 IST|Sakshi
అర్జున్, నటి శ్రుతీహరిహరన్‌

నటి శ్రుతీహరిహరన్‌

పెరంబూరు: నటుడు అర్జున్‌ అభిమానుల నుంచి తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని నటి శ్రుతీహరిహరన్‌ ఆరోపించింది. దేశంలో మీటూ కలకలం రోజురోజుకు పెరిగిపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది రచ్చ రచ్చగా మారింది. మీటూ ఆరోపణలు చాలా కాలం నుంచే ఉన్నా, గాయని చిన్మయి గీతరచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేయడంతో ఇది ఒక ఉప్పెనలా చెలరేగింది. నటుడు అర్జున్‌ను కూడా ఈ మీటూ సెగలు తాకాయి. మలయాళ నటి శ్రుతీహరిహరన్‌ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. షూటింగ్‌ పూర్తి కాగానే క్యారవాన్‌కు రమ్మని సినీ కార్మికుడితో చెప్పేవారని, పలు మార్లు రాత్రి విందుకు ఆహ్వానించి వేధించారని ఆరోపించింది. శ్రుతీ హరిహరన్‌ ఆరోపణలను అర్జున్‌ కొట్టి పారేస్తూ, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారని ఆమె ఆదివారం మళ్లీ ఆరోపణలు చేసింది.

ఈమె కేరళాలో జరిగిన హక్కులు సమధర్మ సినీ శాఖ అనే సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నటుడు అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారంది. అపరిచితుల ఫోన్‌కాల్స్‌ నిరాటంకంగా వస్తున్నాయని చెప్పింది. ఈ సందర్భంగా ఏడాది దాటిన తరువాత ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని విలేకరి అడిగిన ప్రశ్నకు తాను అప్పుడే తన ఆవేదనను, వ్యతిరేకతను ఆ చిత్ర దర్శకుడి వద్ద వ్యక్తం చేశానన్నారు. అదే విధంగా ఆ చిత్ర రిహార్సల్స్‌కు వెళ్లడం మానేశానని, అంతకంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తాను ఉన్నానని బదులిచ్చింది. ఇప్పుడు మీటూ ద్వారా పలువురు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగంగా చెప్పడానికి ముందుకు రావడంతో తాను తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

సహాయ నటి ఆరోపణలు..
నటుడు అర్జున్‌పై మరో సహాయ నటి కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఒక చిత్ర షూటింగ్‌లో వేరే యువతిని తన గదికి తీసుకురమ్మని తనతో అర్జున్‌ చెప్పారని, అదే విధంగా ఆర్టిస్ట్‌ సప్లయర్‌కు డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారని ఆ సహాయ నటి ఆరోపణలు చేస్తూ ఒక టీవీకిచ్చిన భేటీలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు