విశ్వనటుడికి జీవిత సాఫల్య అవార్డు

12 Mar, 2016 03:26 IST|Sakshi
విశ్వనటుడికి జీవిత సాఫల్య అవార్డు

విశ్వనటుడు కమలహాసన్ అవార్డులకే అలంకారం అనడంలో అతిశయోక్తి కాదేమో. ఇప్పటికే పద్మశ్రీ వంటి జాతీయ అవార్డుతో పాటు పలు విశిష్ట అవార్డులు ఆయన్ని వరించాయి. తాజాగా జీవిత సాఫల్య తమిళర్ అవార్డు పురస్కారం కమలహసన్ కోసం ఎదురు చూస్తోంది. ఆరేళ్లుగా నార్వే చిత్రోత్సవాలు నిర్వహిస్తూ తమిళ కళాకారులతో పాటు, తమిళేతర చిత్ర కళాకారులకు తమిళర్ విరుదు పేరుతో అవార్డులను అందిస్తున్నారు. ఏడో నార్వే తమిళ చిత్రోత్సవ కార్యక్రమం మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకూ నార్వేలో నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పోటీకి నామినేషన్ల గడువు ఈ నెల 15తో ముగియనుందని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ నెల 25న అవార్డులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రోత్సవాల్లో తమిళనాడులో నిర్మించిన చిత్రాలతో పాటు తమిళేతర దేశాల్లో రూపొందించిన తమిళ చిత్రాలకు అవార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. పూర్తి చిత్రాలతో పాటు లఘు చిత్రాలు, డాక్యుమెంట్ చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ కేటగిరీల్లో అవార్డు పోటీలు ఉంటాయన్నారు. నార్వే ప్రభుత్వ అంగీకారంతో ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన విశ్వనటుడు కమలహాసన్‌ను జీవిత సాఫల్య తమిళర్ బిరుదుతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. అలాగే నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కలైశిఖరం అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.