మండు వేసవిలో ఐస్‌క్రీమ్‌లా...

22 Apr, 2014 23:59 IST|Sakshi
మండు వేసవిలో ఐస్‌క్రీమ్‌లా...

ఓ యువకుడు బాగా డబ్బు సంపాదించి తన సమస్యలతో పాటు తన చుట్టూ ఉన్నవారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాడన్నది ఇందులో వినోదాత్మకంగా చూపిస్తున్నాం. రాజీవ్ చాలా ఎనర్జీతో నటించాడు. పాటల రికార్డింగ్ అమెరికాలో చేశాం. మండు వేసవిలో ఐస్‌క్రీమ్‌లా ఉంటుందీ సినిమా’’ అని దర్శకుడు శ్రీరామ్ వేగరాజు చెప్పారు. రాజీవ్ సాలూరి, మధురాక్షి, మౌనిక హీరోహీరోయిన్లుగా ఛేజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ వేగరాజు, మాధురి వేగరాజు నిర్మించిన ‘ఓరి... దేవుడోయ్’ పాటల సీడీని హైదరాబాద్‌లో సూపర్‌స్టార్ కృష్ణ ఆవిష్కరించి, తొలి ప్రతిని డి.రామానాయుడికి అందించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ- ‘‘సాలూరి రాజేశ్వరరావుగారు, ఆ తర్వాత కోటి నేను నటించిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు.
 
 అన్నీ సూపర్‌హిట్సే. కోటి కొడుకు హీరోగా నటిస్తున్న ఈ సినిమా పెద్ద హిట్టు కావాలి’’ అని ఆకాంక్షించారు. కోటి మాట్లాడుతూ- ‘‘మా రాజీవ్ సోలో హీరోగా నటించిన ఈ సినిమాకు సంగీతం అందించినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. చక్కటి సోషియో ఫాంటసీ చిత్రమిదని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో జెమినీ కిరణ్, బి.గోపాల్, మణిశర్మ, లగడపాటి శ్రీధర్, ‘మల్టీ డైమన్షన్’ వాసు తదితరులు మాట్లాడారు.