‘నా ఆత్మ, శరీరం సంతోషంతో నిండిపోయాయి’

29 Jan, 2019 17:14 IST|Sakshi
తన ఇద్దరు కూతుళ్లతో లీసా రే

‘మీరు సరిగ్గానే చెప్పారు. నేను వృద్ధురాలినే. సమయం కన్నా, నా భర్త కన్నా కూడా. మీరు శారీరకంగా ఎదిగారు గానీ.. మానసికంగా మాత్రం ఎదగలేదు. అయినా తెలివితేటలు కలిగి ఉండటం కూడా ఓ వరమే. క్యాన్సర్‌ను జయించిన నేను.. నా 46వ ఏట పరిపూర్ణ జీవితాన్ని గడుపుతున్నాను. నా ఆత్మ- శరీరం.. భద్రత, సంతోషంతో నిండిపోయాయి. మీకు కూడా ఏదో ఒకరోజు ఇలాంటి అనుభవం రావాలని కోరుకుంటున్నా’  అంటూ మోడల్‌, బాలీవుడ్‌ నటి లీసా రే తనను ఎద్దేవా చేసిన వ్యక్తికి ట్విటర్‌ వేదికగా ఘాటు సమాధానమిచ్చారు.

ఇంతకీ విషయమేమిటంటే.. టొరంటోలో తాను దిగిన ఫొటోను లీసారే ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇందుకు స్పందనగా హర్షద్‌ పటేల్‌ అనే నెటిజన్‌ ..‘ టూ ఓల్డ్‌’అంటూ కామెంట్‌ చేశారు. దీంతో లీసారే పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన హర్షద్‌ లీసారేను క్షమాపణ కోరాడు. ‘మీరనుకున్నట్లుగా నేను పబ్లిసిటీ కోసం కామెంట్‌ చేయలేదు. నాకు అనిపించింది చెప్పాను అంతే’ అంటూ మరో ట్వీట్‌ చేశాడు. ఇందుకు స్పందించిన లీసారే.. .‘ మీ మాటలకు నేను అస్సలు బాధపడలేదు. అయితే టూ ఓల్డ్‌  అనే పదం స్త్రీపట్ల సమాజపు ఆలోచనా విధానానికి నిదర్శనం. వయసు ఆధారంగా ఒక వ్యక్తిని చూసే దృష్టి మారుతుంది. ఇలాంటి మాటలు మన మానసిక పరిపక్వతను తెలియజేస్తాయి. నేనైతే కౌమార దశలోనే తెలివిగా ఎలా మసలుకోవాలి, ఎదుటి వ్యక్తుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలి అనే విషయాలు నేర్చుకున్నా’ అంటూ మరోసారి దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. లీసా రే స్పందించిన తీరుపై సునీల్‌ శెట్టి, ఇలియానా సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా క్యాన్సర్‌ నుంచి కోలుకున్న రెండేళ్ల తర్వాత(2012) తన చిరకాల మిత్రుడు జాసన్‌ డేహ్నిని పెళ్లాడిన లీసా రే గతేడాది సెప్టెంబరులో సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. అదేవిధంగా.. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం కోల్పోయినట్లు కాదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారు.


 

మరిన్ని వార్తలు