అర్‌.. ర్‌..ర్‌.. ర్రే!

20 Dec, 2016 00:14 IST|Sakshi
అర్‌.. ర్‌..ర్‌.. ర్రే!

ఆర్‌ ఎప్పుడూ రైటే.ఆర్‌ ఎప్పుడూ రాంగ్‌ కాదు.ఆర్‌ ఎప్పుడూ రాణే.ఆర్‌తో మొదలైతే ఆరా తీయడం అంటూ ఏమీ ఉండదు.హీరోయిన్‌గా తీసుకోవడం హిట్‌ సాధించడం... అంతే.ఇప్పుడు తెలుగులో ‘ఆర్‌’ (తెలుగులో ర) అక్షరంతో మొదలయ్యే నలుగురు నాయికల కెరీర్‌ చూస్తుంటే.. ‘ఆర్‌’ ఫర్‌ రాకింగ్‌ అని మీరే అంటారు. రకుల్‌ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, రెజీనా, రాయ్‌ లక్ష్మీ... ఈ నలుగురికీ 2016 మెమరబుల్‌.చదివితే అర్రే అని మీరే అంటారు.



గ్లామర్‌లో హైపర్‌..కామెడీలో క్వీన్‌!
కథానాయికలు కామెడీ చేస్తే భలే ఉంటుంది కదూ! ‘ఊరుకోండి.. మీరు చెప్పేది కామెడీగా ఉంది. ఓ నాలుగు పాటలు, ఐదు సీన్లలో హీరో పక్కన.. అయితే నవ్వుతూ లేదంటే బుంగమూతి పెట్టుకుని కనిపించడం తప్ప హీరోయిన్లు ప్రేక్షకుల్ని నవ్విస్తారా’ అనేగా మీ సందేహం. కావాలంటే ‘సుప్రీమ్‌’ సినిమా చూడండి. బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా భలే నవ్వించారు. ఈ ముద్దుగుమ్మ గతేడాది మూడు సినిమాలు చేశారు. అవన్నీ రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ గుర్తింపే తీసుకొచ్చాయి. వాటిలో నటిగా తన ప్రత్యేకతను చూపించే అవకాశం రాశీఖన్నాకు దక్కలేదు. ‘సుప్రీమ్‌’లో ఆ ఛాన్స్‌ రావడంతో చెలరేగారు. ఎస్‌ఐగా సీరియస్‌ డైలాగులు చెప్పి, నవ్వించారు. కామెడీగా ఫైట్స్‌ చేసి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. ‘సుప్రీమ్‌’ తర్వాత వచ్చిన ‘హైపర్‌’లో అయితే రాశీఖన్నా గ్లామర్‌డోస్‌ పెంచారనే చెప్పుకోవాలి. సినిమాలోనే కాదు.. ‘హైపర్‌’ ఆడియోకి వేసుకొచ్చిన డ్రస్‌ కూడా హాట్‌ టాపిక్‌ అయింది. ఒకప్పుడు బొద్దుగా ఉందని విమర్శించినోళ్లే, ఈ ఏడాది వచ్చిన సినిమాలు చూసి రాశీఖన్నా ముద్దు ముద్దుగా నవ్వించిందనీ, నటించిందనీ అంటున్నారు. మొత్తం మీద 2015తో పోల్చితే 2016 ఈ బ్యూటీకి కలిసొచ్చిందనే చెప్పాలి. కొత్త ఏడాదిలో గోపీచంద్‌ ‘ఆక్సిజన్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ఆల్రెడీ రెండు తమిళ సినిమాలకు సైన్‌ చేసేశారు.

వెయిటింగ్‌ టు రాక్‌!
సై్టల్‌.. స్మైల్‌.. గ్లామర్‌గా కనిపించే గట్స్‌... రెజీనాలో అన్నీ ఉన్నాయి. ఈ హీరోయిన్‌ యాక్టింగ్‌కి ప్రేక్షకులు మంచి సర్టిఫికెట్‌ ఇచ్చారు. కానీ, ఆమె ఖాతాలో సాలిడ్‌ హిట్‌ పడలేదు. ఈ ఏడాది రెజీనా రెండు సినిమాల్లో నటించారు. అవేవీ చెప్పుకోదగ్గ విజయాలు ఇవ్వలేదు. కానీ, కృష్ణవంశీ ‘నక్షత్రం’తో రాకింగ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇస్తానంటున్నారు రెజీనా. ‘చందమామ’తో కాజల్‌ అగర్వాల్, ‘మొగుడు’తో తాప్సీ, ‘పైసా’తో కేథరిన్‌... ఈతరం హీరోయిన్లకు గ్లామర్‌ పరంగా కృష్ణవంశీ బ్రేక్‌ ఇచ్చారు. ‘నక్షత్రం’లో రెజీనా ఇప్పటివరకూ కనిపించనంత అందంగా ఉంటుందన్నట్లు ఆమె బర్త్‌డేకి ఓ సాంపిల్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు. అందులో ఈ చెన్నై బ్యూటీని రాక్‌స్టార్‌గా అభివర్ణించారు కృష్ణవంశీ. మరి, సినిమా రిలీజయ్యాక రెజీనా ఏమాత్రం రాక్‌ చేస్తారో చూడాలి. తెలుగు సంగతి పక్కన పెడితే... రాకింగ్‌ హీరోయిన్ల జాబితాలో రెజీనాని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, 2016 ఆమెకు హిందీ సినిమాకి అవకాశం తెచ్చిపెట్టిన సంవత్సరం. అమితాబ్‌ బచ్చన్, అనిల్‌కపూర్, అర్జున్‌ రాంపాల్, అర్షద్‌ వార్సి వంటి స్టార్స్‌ నటించనున్న హిందీ ‘ఆంఖే–2’లో ఛాన్స్‌ రావడంతో రెజీనా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఇది కాకుండా తమిళంలో ఓ ఐదు సినిమాల్లో నటిస్తున్నారు.

కుర్రాళ్లకు పరేషానురా..
ప్రేమలో పడితే పరేషాను ఉంటుందో? లేదో? తెలియదు గానీ... ‘ధృవ’లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను చూస్తే కుర్రాళ్లకు పరేషాను తప్పదు. అందమే అసూయ పడేలా ‘పరేషాను రా..’ పాటలో రకుల్‌ గ్లామర్‌తో రాక్‌ చేశారు. అందమేనా... సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’, తర్వాత ‘సరైనోడు’, ఇప్పుడు థియేటర్లలో ఉన్న ‘ధృవ’ ఈ ఏడాది హీరోయిన్‌గా నటించిన మూడు సినిమాల్లోనూ అభినయంతో రకుల్‌ రఫ్ఫాడించేశారు. గతేడాది ఈమె చేసిన సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. అప్పుడు రకుల్‌పై గ్లామర్‌ డాల్‌ ముద్ర వేశారు. అందం వల్లే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడీ గాళ్‌ గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ ఇరగదీస్తుందని అంటున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో అందం, అమాయకత్వం గల అమ్మాయిగా నటించడమే కాదు... ఆ పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పారు. ‘సరైనోడు’లో అయితే.. మేకప్‌ లేకుండా ఎమోషనల్‌ సీన్స్‌లో నటించిన తీరు నటిగా రకుల్‌కి రెస్పెక్ట్‌ తెచ్చిపెట్టింది. ఇక, ‘ధృవ’తో ముచ్చటగా మూడో హిట్‌ అందుకుని రాకింగ్‌ స్టార్‌ అయ్యారు. ముచ్చటగా మూడు విజయాలతో జోష్‌ మీద ఉన్న రకుల్‌కి వచ్చే ఏడాది కూడా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే, డైరీ ఫుల్‌.  మహేశ్‌బాబు – ఏఆర్‌. మురుగదాస్‌ సినిమా, సాయిధరమ్‌ తేజ్‌ ‘విన్నర్‌’, బోయపాటి శ్రీను – బెల్లంకొండ సాయి సినిమా.. కొత్త ఏడాది కూడా మినిమమ్‌ మూడు సినిమాలతో రకుల్‌ ప్రేక్షకుల ముందు రావడం గ్యారెంటీ. వీటితో పాటు తమిళ సినిమాలకు కూడా సైన్‌ చేశారు.


రాకింగ్‌ ఐటమ్‌
ఒక్క పాట... ఒక్కటంటే ఒక్క పాట.. అది కూడా ఐటమ్‌ పాట. తెలుగులో రాయ్‌లక్ష్మీకి మళ్లీ లైఫ్‌ ఇచ్చింది. ఐటమ్‌ గాళ్‌ కేటగిరీలో ఈ ఏడాది రాక్‌స్టార్‌ ఎవరంటే... రాయ్‌లక్ష్మీ పేరే లిస్టులో ముందుంది. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో పవన్‌కల్యాణ్‌తో కలసి రాయ్‌లక్ష్మీ స్టెప్పులేశారు. సినిమా రిజల్ట్‌ పక్కన పెడితే ‘తప్పు తప్పే... శుద్ధతప్పే’ అనే పాట సూపర్‌ హిట్‌. అందులో ఆమె స్టెప్పులు, ఆమె గ్లామర్‌ కూడా హిట్టే. హీరోయిన్‌గా పదేళ్ల కెరీర్‌లో ఈమెకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కానీ, ఐటమ్‌ గాళ్‌గా రాకింగ్‌ స్టెప్పులతో ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది పవన్‌కల్యాణ్‌తో ఐటమ్‌ సాంగ్‌ చేసిన రాయ్‌లక్ష్మీ, రానున్న సంక్రాంతికి రిలీజవుతోన్న ‘ఖైదీ నంబర్‌ 150’ కోసం చిరంజీవితో కలసి స్టెప్పులేశారు. మరి, అందులో ఐటమ్‌ సాంగ్‌ ఎలా ఉంటుందో!! ఈ పాటలను పక్కన పెడితే.. సౌత్‌లో పదేళ్లకు పైగా పలు సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడీ భామ ‘జూలీ–2’తో హిందీలో హీరోయిన్‌గా అడుగు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. 2016లో అతిథిగా కనిపించిన ‘అఖీరా’తో తొలిసారి హిందీ తెరపై కనిపించారు. అది చేస్తున్నప్పుడే ‘జూలీ–2’లో కథానాయికగా అవకాశం కొట్టేశారు. ఆ రకంగా రాయ్‌లక్ష్మీకి ఈ ఏడాది మెమరబుల్‌ అవుతుంది.

‘ఆర్‌’ అంటే హిట్టే!
ఓ పాతికేళ్లు వెనక్కి వెళితే... అప్పట్లో తిరుగులేని తారలు అనిపించుకున్న రాధికా, రాధ, రేవతి తదితరుల పేర్లు ‘ఆర్‌’తో మొదలైనవే. విశేషం ఏంటంటే.. తమిళ దర్శకుడు భారతీరాజా తాను పరిచయం చేసే కథానాయికలకు ‘ఆర్‌’ అక్షరం వచ్చేట్లు పేరు పెడతారు. రాధ అసలు పేరు ఉదయచంద్రిక. ‘అలైగళ్‌ ఓయ్‌వదిల్లై’ సినిమా ద్వారా ఆమెను పరిచయం చేస్తూ, ‘రాధ’గా మార్చారు. విలక్షణ నటి రేవతి తొలి పరిచయం కూడా భారతీరాజా సినిమాతోనే జరిగింది. ‘మన్‌వాసనై’ అనే సినిమాకి రేవతిని నాయికగా ఎన్నుకున్న తర్వాత ‘ఆశా కుట్టి నాయర్‌’ అనే ఆమె పేరుని రేవతిగా మార్చారు.

‘ఆర్‌’ అక్షరంతో మొదలయ్యే మరో నటి రాధిక. ఆమె రియల్‌ నేమ్‌తోనే స్క్రీన్‌కి పరిచయమయ్యారు. అయితే పరిచయం చేసింది మాత్రం భారతీరాజానే. ‘కిళక్కే పోగుమ్‌ రైల్‌’ ద్వారా ఆయన రాధికను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె తిరుగు లేని తార అయ్యారు. అలాగే రతీ ఆగ్నిహోత్రిని పరిచయం చేసింది కూడా భారతీరాజానే. ‘పుదియ వార్‌పుగళ్‌’ చిత్రం ద్వారా కథానాయికగా తమిళ్‌ తెరకు పరిచయమైన ఈ హిందీ అమ్మాయి ఆ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్‌ అయ్యారు. నిత్యానంద స్వామితో లింకప్‌ వార్తల్లో నిలిచిన రంజిత అసలు పేరు శ్రీ వల్లి. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘నాడోడి తెండ్రల్‌’ ద్వారా ఆమె తమిళ తెరకు పరిచయమయ్యారు. రాధ, రాధిక, రేవతిల రేంజ్‌ స్టార్‌డమ్‌ తెచ్చుకోకపోయినా రంజిత బాగానే పేరు తెచ్చుకున్నారు.

దక్షిణాదిన తిరుగు లేని నాయిక అనిపించుకున్న రోజాకి నామకరణం చేసింది కూడా భారతీరాజానే. ఆమె అసలు పేరు శ్రీలత. ‘ప్రేమ తపస్సు’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారతీరాజా తొలి దృశ్యానికి క్లాప్‌ ఇచ్చి, రోజాకి పేరు పెట్టారు. నాటి, నేటి తారల్లో ‘ఆర్‌’తో పేరు మొదలైనవాళ్లు రాక్‌ చేస్తున్నారు కాబట్టి, ఈ అక్షరం కలిసొస్తుందని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు ఉంటారు.
ఎవరి నమ్మకం వారిది.

ఇదండి సంగతి...రకుల్, రాశీ, రెజీనా,రాయ్‌ లక్ష్మీల కెరీర్‌ చూస్తుంటే... ‘ఆర్‌’ ఫర్‌ రాకింగ్‌ అనొచ్చు కదూ!  -సత్య పులగం