విజయవాడ టు లండన్‌ బాబులు

16 Nov, 2017 01:24 IST|Sakshi

‘‘సినిమాల్లో నటించడం వల్ల ఇందులోని ఇబ్బందులు తెలిశాయి. ఇప్పుడు సినిమాపై మరింత గౌరవం పెరిగింది’’ అన్నారు రక్షిత్‌. చిన్నికృష్ణ దర్శకత్వంలో ఆయన హీరోగా ఏవీఎస్‌ స్టూడియో సమర్పణలో మారుతి టాకీస్‌ పతాకంపై రూపొందిన సినిమా ‘లండన్‌ బాబులు’. తమిళ చిత్రం ‘ఆండవన్‌ కట్టళై’కు రీమేక్‌ ఇది. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రక్షిత్‌ మాట్లాడుతూ– ‘‘విజయవాడలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివాను. నాన్న వరప్రసాదరావుగారి ద్వారా మారుతిగారు తెలుసు. ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి ఉందా? అని నన్ను అడిగారాయన. ఎడ్యుకేషన్‌ కంప్లీట్‌ చేసుకున్న తర్వాత మారుతిగారిని కలిశాను. ఈ సినిమాను తెరకెక్కించే ప్రక్రియలో భాగంగానే నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నారు.

ఓ దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకులు విదేశాలకు వెళ్లి ఎక్కవ డబ్బులు సంపాదించాలనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేశారన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించారు. నేను గాంధీ అనే రోల్‌ చేశాను. రిపోర్టర్‌ సూర్యకాంతంగా స్వాతి నటించారు. స్వాతి వంటి సీనియర్‌ నటితో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మా ఇద్దరి మధ్య లవ్‌ సీన్స్‌ ఉన్నాయి. స్వాతి నటన సినిమాకు ప్లస్‌. ఈ సినిమాతో ఫస్ట్‌ సక్సెస్‌ అందుకుంటానన్న నమ్మకం ఉంది. భవిష్యత్‌లో నటుడిగానే కొనసాగాలనుకుంటున్నాను. ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేసే కథలను ఎంచుకోవాలనుకుంటున్నాను. డ్యాన్స్, డైలాగ్‌ డిక్షన్‌ ఇంప్రూవ్‌ చేసుకుంటున్నాను. నా నెక్ట్స్‌ మూవీ మారుతిగారితోనే ఉంటుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు