అందుకే మా జిల్లాలో నేనే పంపిణీ చేస్తున్నా

25 Sep, 2014 23:54 IST|Sakshi
అందుకే మా జిల్లాలో నేనే పంపిణీ చేస్తున్నా

 ‘‘భవ్య క్రియేషన్స్ సంస్థలో నేను చేసిన ‘వాంటెడ్’ ఆశించిన ఫలితం సాధించలేదు. అందుకే, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి మళ్లీ ఆ సంస్థలో సినిమా చేద్దామనగానే.. ఈసారి నిర్మాతగా ఆనందప్రసాద్‌గారు సంతృప్తిపడే సినిమా ఇవ్వాలనుకున్నాను. చాలా కథలు విన్న తర్వాత శ్రీధర్ సీపాన చెప్పిన కథ బాగా నచ్చి, అంగీకరించాను. ఈ కథకు దర్శకుడిగా శ్రీవాస్ అయితే బాగుంటుందనుకున్నాం. ఆ తర్వాత కోన వెంకట్, గోపీ మోహన్‌లను పిలిపించి స్క్రీప్‌ప్లే తయారు చేయించాం. ఇందులో నాది చాలా మంచి పాత్ర’’ అని గోపీచంద్ చెప్పారు.
 
 శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా వి. ఆనందప్రసాద్ నిర్మించిన ‘లౌక్యం’ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ వేడుకలో శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘ ‘లౌక్యం’ కథ వినగానే హిట్ అనే నమ్మకం కలిగి చేశాం. గోపీచంద్‌తో మంచి కుటుంబ కథా చిత్రం తీయాలనే ఆశయంతో చేసిన సినిమా ఇది.
 
 ఆయన మార్క్ యాక్షన్ కూడా ఉంటుంది. నేనీ చిత్రాన్ని తూర్పు గోదావరి జిల్లాలో పంపిణీ చేయబోతున్నాను’’ అన్నారు. గోపీచంద్‌తో తనకిది తొలి చిత్రమని, ఆయన కెరీర్‌లో ‘ది బెస్ట్’ సినిమా ఇదని, ఈ చిత్రం మీద నమ్మకంతో గుంటూరులో విడుదల చేస్తున్నానని రచయిన కోన వెంకట్ చెప్పారు. గోపీచంద్‌తో చేసిన ఈ చిత్రం బ్రహ్మాండమైన విజయం సాధించడం ఖాయమని ఆనందప్రసాద్ అన్నారు. బ్రహ్మానందం, అన్నే రవి, అనూప్ రూబెన్స్, శ్రీధర్ సీపాన, రఘు, వెట్రి, పృథ్వీ, అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.