అందుకే ‘ప్రిన్స్’ అయ్యాను : ప్రిన్స్

31 Aug, 2013 01:02 IST|Sakshi
అందుకే ‘ప్రిన్స్’ అయ్యాను : ప్రిన్స్
నీకు నాకు డాష్ డాష్, బస్‌స్టాప్, రొమాన్స్ చిత్రాల్లో హీరోగా చేసిన ప్రిన్స్... ఇప్పుడు చిన్న సినిమాల పాలిట మహేష్‌బాబు. తక్కువ సమయంలోనే బిజీ అయిపోయిన ఈ వైజాగ్ కుర్రాడితో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. స్పీడ్‌గా ఎదుగుతోన్న ఈ లవర్ బాయ్‌తో ఓ చిరు భేటీ...
 
 ***  అసలు ప్రిన్స్ అని మీకెందుకు పేరు పెట్టారు?
 మా పెదనాన్నకన్నా మా నాన్నగారు ముందు పెళ్లి చేసుకున్నారు. ఈ తరంలో మా కుటుంబంలో పుట్టిన మొదటి మనవణ్ణి నేనే. అందుకే ముద్దుగా మా తాతగారు ప్రిన్స్ అని పెట్టారు.
 
 ***  మరి... ఇంట్లో చాలా గారాబం చేసేవాళ్లేమో?
 చాలా అంటే చాలా. ఆడింది ఆటగా పాడింది పాటగా ఉండేది. తప్పు చేసినా ఏమీ అనేవాళ్లు కాదు.
 
 ***  మీ నాన్నగారికే ముందు పెళ్లయ్యిందన్నారు..? మీ అమ్మానాన్నలకేమైనా లవ్‌స్టోరీ ఉందా?
 ఉందండి. వైజాగ్‌లో చదువుకుంటున్నప్పుడు అమ్మా నాన్న ప్రేమించుకున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కుటుంబాన్ని పోషించాలి కాబట్టి.. వైజాగ్‌లో ఒక రిటైల్ షాప్ ఓపెన్ చేశారు. మా షాప్‌లో టాయ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పటికీ ఆ షాప్ ఉంది.
 
 ***  ఓకే.. ఇక సినిమాల విషయానికొద్దాం.. హీరో అవ్వాలని చిన్నప్పట్నుంచే అనుకునేవారా?
 నాకన్నా మా నాన్నగారికి ఎక్కువగా ఉండేది. మోడలింగ్ చేయమని చెప్పేవారు. ఫొటో షూట్స్ చేయించేవారు. నా మీద నాకన్నా మా నాన్నగారికి నమ్మకం ఎక్కువ. నాన్నగారి నమ్మకం చూసి, నాక్కూడా మెల్లిగా నమ్మకం కుదిరింది.
 
 ***  ‘నీకు నాకు డాష్ డాష్’ ఆఫర్ ఎలా వచ్చింది?
 కొత్తవాళ్లతో తేజగారు సినిమా తీస్తున్నారని విని, అప్లయ్ చేశాను. ఆడిషన్స్ చేసి, సెలక్ట్ చేశారు. ఆ క్షణం నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
 
 ***  తేజ కొట్టి పని చేయించుకుంటారట.. మిమ్మల్ని కూడా...?
 సినిమా బాగా రావడం కోసం ఆయన ఏమైనా చేస్తారు. షూటింగ్ స్పాట్‌లో నేను ఏడవాలనుకోండి.. ఏడుపు రాకపోతే తిడతారు. అప్పుడు ఏడుపు దానంతట అది వచ్చేస్తుంటుంది. మా నాన్నగారు తిట్టినప్పుడు ఎలా ఏడుస్తానో అలా అన్నమాట.
 
 ***  మీరు చేసే ప్రతి సినిమా గురించీ తేజ దగ్గర చెబుతారట?
 అవునండీ. ఇప్పుడంటే నాకు పరిశ్రమలో చాలా పరిచయాలు ఏర్పడ్డాయి కానీ, హీరో అయినప్పుడు నాకు తెలిసిన ఏకైక వ్యక్తి తేజగారు. నన్ను హీరోని చేసి, ఈ స్థాయిలో నిలబెట్టారు. ఏం ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను. నా వల్ల ఎంత అయితే అంత విశ్వాసంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఆయన సలహా అడుగుతాను. తేజగారి అనుభవాన్ని ఆ విధంగా నేను వాడుకుంటున్నాను.
 
 ***  మీరు మహేష్‌బాబులా ఉంటారని చాలామంది అంటుంటారు. ఎప్పుడైనా ఆయన్ను కలిశారా?
 వాస్తవానికి నేను మహేష్‌బాబుగారి ఫ్యాన్‌ని. ఆయనలా ఉన్నాననడం ఆనందంగా ఉంది. సినిమాల్లోకొచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి ఆయన అలా వెళుతుంటే చూశాను. ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్‌పైన చూడ్డమే ఆరోజు నేరుగా చూసేసరికి ఎగ్జయిట్ అయ్యాను.
 
 ***  ‘మనసును మాయ సేయకే’ ద్వారా తమిళ్‌కి పరిచయం కాబోతున్నారు.. అక్కడి మార్కెట్‌ని కూడా టార్గెట్ చేశారా?
 నాకు భాషతో సంబంధం లేదు. తెలుగులో మంచి అవకాశాలొస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో రెండు భాషల్లో ఈ సినిమా చేస్తున్నామని అడగ్గానే, ఒప్పుకున్నాను. కథ, నా పాత్ర కూడా బాగున్నాయి. నటనకు అవకాశం ఉన్న పాత్ర కాబట్టి తమిళంలో కూడా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో చేస్తున్న ‘బన్నీ ఎన్ చెర్రీ’ కూడా నా కెరీర్‌కి హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉంది.
 
 ***  ‘బాషా’ ఫేమ్ సురేష్‌కృష్ణ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారట?
 అవును. అది క్రైమ్ థ్రిల్లర్. సురేష్‌కృష్ణగారి సినిమాల్లో హీరోలకో ప్రత్యేకమైన స్టయిల్, మేనరిజమ్ ఉంటాయి. ఇందులో నా పాత్ర కూడా అలానే ఉంటుంది.