ఆ లక్కీచాన్స్‌ ఎవరిదో?

24 Jul, 2017 01:31 IST|Sakshi
ఆ లక్కీచాన్స్‌ ఎవరిదో?

తమిళసినిమా:  రకుల్‌ప్రీత్‌సింగా? సోనాక్షినా? ఇళయదళపతితో జోడి కట్టే లక్కీచాన్స్‌ దక్కించుకునే ముద్దుగుమ్మ ఎవరో? విజయ్‌ అభిమానుల్లో ఆసక్తిగా మారిన అంశం ఇదే. విషయం ఏమిటంటే అట్లీ దర్శకత్వంలో మెర్సల్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ఇళయదళపతి విజయ్‌ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే తుపాకీ, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయన్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌కు రెడీ అవుతోంది.

అయితే ఇందులో విజయ్‌తో జత కట్టే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది. విజయ్‌కు జంటగా ప్రస్తుతం ఉన్న ప్రముఖ నటీమణులందరూ నటించారు. కాబట్టి ఇప్పటి వరకూ ఆయనతో జత కట్టని హీరోయిన్‌ను నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా స్పైడర్‌ చిత్రాన్ని చేస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ముమ్మరంగా ఉంది. సెప్టెంబర్‌లో విడుదలకు ముస్తాబవుతోంది.

ఇందులో కథానాయకిగా నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి దర్శకుడు వచ్చినట్టు తెలుస్తోంది.రకుల్‌ప్రీత్‌సింగ్‌ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. కోలీవుడ్‌లోనే ప్రస్తుతం కార్తీకి జంటగా ధీరన్‌ అధ్యాయం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. తాజాగా సూర్య హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనితో పాటు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. అలాంటిది విజయ్‌తో నటించడానికి కాల్‌షీట్స్‌ సర్దుబాటు చేయగలుగుతుందా అన్న సందేహం నెలకొంది. ఇదిలా ఉంటే దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ బాలీవుడ్‌ భామ సోనాక్షిసిన్హాను తన తాజా చిత్రంలో నటింపజేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

ఇంతకు ముందు హిందీ చిత్రం అకిరలో వీరిద్దరు కలిసి పని చేశారన్నది గమనార్హం. సోనాక్షి సిన్హా ఇప్పటికే రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యిందన్నది తెలిసిందే. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఈ భామ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్‌ 62వ చిత్రంలో నాయకిగా నటించే లక్కీఛాన్స్‌ను నటి రకుల్‌ప్రీత్‌సింగ్, సోనాక్షిలలో ఎవరు దక్కించుకుంటారన్నది కోలీవుడ్‌గా ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. దీనికి యువ సంగీతదర్శకుడు అనిరుధ్‌ సంగీతాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా