పాటల తోటలో ఒంటరి సేద్యం!

27 Aug, 2019 11:57 IST|Sakshi
హీరో విజయ్‌ దేవరకొండతో రాంబాబు

సినీ గీతరచయిత గోసాల రాంబాబు

సాక్షి, తెనాలి: కృష్ణాజిల్లాలోని ఓ పల్లెటూరి కుర్రోడు గోసాల రాంబాబు. తెలుగు సినిమా గీత రచయితగా గెలిచాడు. పదేళ్ల సినీజీవితంలో 30 సినిమాల్లో వంద పాటలు రాశాడు. పాటల తోటలో తాను చేసిన ఒంటరి సేద్యం అద్భుతమైన సాహిత్యం అందించిందని చెబుతున్న రాంబాబు  సోమవారం తెనాలి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి వెల్లడించిన విశేషాలు ఆయన మాటల్లోనే...

ఉద్యోగం పేరుతో సినిమాల వైపు..
కృష్ణాజిల్లా ముసునూరు మండలం వేల్పుచర్ల నా సొంతూరు. తలిదండ్రులు గోసాల దానయ్య, కోటేశ్వరమ్మ.  పాటలవైపు మళ్లింది హైస్కూల్లోనే. ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకుని వేసిన అడుగులు...సినిమా రంగంకేసి నడిచాయి. ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌కి వెళ్లాను.

‘ఉయ్యాల జంపాల’తో అవకాశాలు
‘వియ్యాలవారి కయ్యాలు’కు తొలిసారిగా నాకు పాట రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. అనంతరం స్నేహితుడు విరించి వర్మతో వరించిన ‘ఉయ్యాల జంపాల’ సినిమా పాట (నిజంగా నేనేనా)తో అవకాశాలు తలుపు తట్టాయి. మజ్నూ చిత్రంలో పాటలకు అభినందనలు అందుకున్నా. డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి ఇచ్చిన స్టోరీ అవుట్‌పుట్స్‌తో ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో రెండు పాటలు రాశాను. నాకు పేరుతో పాటు అవార్డులనూ తెచ్చిపెట్టాయి.

యూత్‌కి కనెక్ట్‌ అయ్యాయి..
అర్జున్‌రెడ్డి సినిమాలో లవ్‌ బ్రేకప్‌ పాట యూత్‌కి బాగా కనెక్టయింది. ‘తెలిసెనే నా నువ్వే...నా నువ్వు కాదనీ...తెలిసెనే నేననే నే నేను కాదనీ’ అంటూ ఆరంభమయ్యే పాటది. ఇది సినిమాలో అర్జున్‌రెడ్డి ప్రేమ గురించే అయినా, నా జీవితానికీ అన్వయించొచ్చు. సినిమా టైటిల్స్‌లో పేరు చూసుకుని శభాష్‌ అంటూ నాకు నేను భుజం తట్టుకోవటానికి పదేళ్లు పట్టింది.

సినీ ‘మజిలీ’ బాగుంది..
ఈ ఏడాది నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన ‘మజిలీ’ సినిమాలో ‘నా గుండెల్లో ఉండుండి’ అనే పాట, ప్రస్తుతం థియేటర్లలో వున్న ‘కౌసల్య కృష్ణమూర్తి’లో ‘రాకాసి గడుసుపిల్ల’ పాటలు విజయవంతమయ్యాయి. ఆలీ హీరోగా నటించిన పండుగాడి ఫొటో స్టూడియో సినిమాలో అన్ని పాటలూ నేనే రాశాను. ప్రస్తుతం మరో పది సినిమాలకు పాటలు రాస్తున్నాను. అర్జున్‌రెడ్డి సినిమాకు ఉత్తమ గేయరచయితగా ప్రభుత్వ ఉగాది పురస్కారం తీసుకున్నాను. 2018లో ఉదయ్‌కిరణ్‌ స్మారక అవార్డు, 2019లో మనసుకవి ఆత్రేయ పురస్కారం అందుకున్నాను. 

మరిన్ని వార్తలు