ఆ గాయంలోంచే గేయం పుట్టింది

22 Jan, 2019 09:22 IST|Sakshi

సోదరుడి మరణాన్ని తట్టుకోలేకపోయా

ఆ వేదనే నన్ను రచయితగా మార్చింది

సినీ గేయ రచయిత్రి లక్ష్మీ ప్రియాంక

పాటల పల్లకీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

శ్రీనగర్‌కాలనీ: ఆమె చదివింది ఎంటెక్‌.. చేసేది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం..ప్రవృత్తి మాత్రం కవిత్వం, పాటలు రాయడం. సినీ గేయ రచయిత్రిగానూరాణిస్తున్నారు లక్ష్మీ ప్రియాంక. ఆమె కలం నుంచి ఎన్నో గీతాలు జాలువారాయి. తన పాటల ప్రస్థానం గురించి ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.  

నేను ప్రస్తుతం టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాను. నా ప్రాథమిక విద్య తెలుగు మీడియంలో సాగింది. దీంతో తెలుగుపై మంచి పట్టు వచ్చింది. సమాజం, జీవిత సత్యాలు, జీవన విధానంపై ఎక్కువగా నా మనసులో భావాలను స్నేహితులతో పంచుకునేదాన్ని. ఆ ఆలోచనలతోనే కవిత్వం రాసేదాన్ని. ప్రముఖ రచయిత చలం రచనలు అంటే ఎంతో  ఇష్టం. నా తమ్ముడు అనారోగ్యంతో చనిపోయిన సమయంలో చాలా డిప్రెషన్‌కు లోనయ్యాను. ఆ కాలం మిగిల్చిన ఆ గాయం నుంచి తేరుకోవడానికి నా మనసును రచనల వైపు మళ్లించాను. ‘మా’ టీవీలో వన్‌ డే డీజే ప్రోగ్రాం చేశాను. అదే మొదటిసారి నన్ను నేను కెమెరాలో చూసుకోవడం. నా కవితలు, రచనలకు సోషల్‌మీడియలో పోస్ట్‌ చేసేదాన్ని. అలా సినిమా వారితో పాటు చాలా మంది సన్నిహితులు, స్నేహితులుగా మారారు. వీరిలో  ముఖ్యంగా లక్ష్మీభూపాల, కన్నన్‌లు.

 సప్తగిరి ఎల్‌ఎల్‌బీ ఆడియో వేడుకలో లక్ష్మీప్రియాంక
వందేమాతరం వీడియో సాంగ్‌కు లిరిక్స్‌..
ఐడ్రీమ్స్‌ మీడియా 2016లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి వీడియో పాటను చేశారు. వందేమాతం పేరుతో ఓ పాట రాశాను. కార్తీక్‌ కొడకండ్ల సంగీతం వహించిన ఈ పాటను ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉషా, పృథ్వీచంద్ర, దినకర్, మోహన భోగరాజు, దీపు, రమ్య బెహరలు పాడారు. ఆ తర్వాత ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రంలో విజయ్‌ బుల్గాని సంగీతంలో ఏక్‌ దమ్‌ మస్తుందే.. అనే మాస్‌ పాట రాశాను.  ఈ పాట నాకు మంచి పేరు తీసుకొచ్చింది. గౌతమి చిత్రానికి పాట రాశాను. నటి గౌతమి  ఫోన్‌ చేసి అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది.  అమీర్‌పేట టు అమెరికా, సూపర్‌ స్కెచ్, ఇట్లు అంజలి చిత్రాలకు పాటలను రాశాను. హవా చిత్రంలో అన్ని పాటలనూ రాసే అవకాశాన్ని మధుర శ్రీధర్‌ అందించారు. రవీంద్రభారతిలో సినీవారం ఆధ్వర్యంలో మహిళా రచయిత్రిగా నన్ను సత్కరించారు  

వృథా వస్తువులతో కళారూపాలు  పాటలు రాయడంతో పాటు వాల్‌ ఆర్ట్స్, వృథా వస్తువులతో విభిన్న కళారూపాలను తయారు చేస్తుంటాను. ఇది నా హాబీ. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో కళారూపాలను రూపొందించాను. వాల్‌ ఆర్ట్స్‌ కూడా వేస్తాను. 

మరిన్ని వార్తలు