ఊహాతీత దర్శకుడు

5 Aug, 2014 23:11 IST|Sakshi
ఊహాతీత దర్శకుడు

డా. మాల్కమ్ క్రోవ్ ఒక చైల్డ్ సైకాలజిస్ట్. అతని దగ్గరకో విచిత్రమైన కేసు వస్తుంది. 9 ఏళ్ల కోల్ సియర్‌కి సంబంధించిన కేస్ అది. క్లాస్‌రూమ్‌లో కూర్చున్నప్పుడో లేక హోమ్ వర్క్ చేసుకుంటుండగానో ఏమౌతుందో తెలియదు కాని హఠాత్తుగా దేన్నో చూసి భయపడుతుంటాడు కోల్. దానికి కారణం... ఆ పిల్లాడికి దెయ్యాలు కనిపిస్తుండటం. మొదట క్రోవ్ నమ్మడు. కానీ ఓ సంఘటన వల్ల అది నిజమే అని అర్థమవుతుంది.‘‘అనుకోకుండానో, అదృష్టవశాత్తో నీకు మరణించిన వారి ఆత్మలను చూడగలిగే శక్తి వచ్చింది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నీకు కనపడే ఆత్మలు ఒకప్పుడు మనుషులే కదా.
 
 మనుషుల నుండి నీకు ఏ ముప్పూ లేనప్పుడు, ఆత్మల నుండి కూడా ఏ ముప్పూ ఉండదు’’ అని అతని భయాన్ని పోగొడతాడు క్రోవ్. తన డాక్టర్ చెప్పినట్టుగానే ఆత్మలను చూసి భయపడడం మానేసి, వాటితో స్నేహంగా ఉంటూ, ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు కోల్.ఇది 1999లో విడుదలైన ‘ది సిక్త్స్ సెన్స్’ అనే సినిమా కథాంశం. హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రాన్ని తీసింది మనోజ్ నైట్ శ్యామలన్ అనే ప్రవాస భారతీయుడు. స్పీల్‌బర్గ్ వీరాభిమాని అయిన మనోజ్ శ్యామలన్ తీసే సినిమాల్లో కథ కన్నా కథనం కొత్తగా ఉంటుంది. అంతకుమించి వింతగా ఉంటుంది. ఆత్మలు, అతీంద్రియ శక్తులు లాంటి కథాంశాలకు ఏదో విధంగా మానవీయ స్పర్శను ఆపాదించడం శ్యామలన్ శైలి.
 
 ఇద్దరు సాధారణ వ్యక్తులను తీసుకెళ్లి అసాధారణ సందర్భంలో పారేయడం శ్యామలన్ సక్సెస్ ఫార్ములా. మనలో ఒకడు అనుకునే కేరెక్టర్‌ని ఎవ్వరూ ఊహించని సందర్భంలో పడేసి, ‘అరె! మనక్కూడా ఇలా జరగొచ్చు’ అని సినిమా చూసేంతసేపూ అదే ఆలోచనలో ఉండేలా చేస్తాయి శ్యామలన్ సినిమాలు. ‘అన్‌బ్రేకబుల్’, ‘సైన్స్’, ‘ది విలేజ్’ ఇవన్నీ ఈ కోవకు చెందినవే! పుట్టి పెరిగింది అమెరికాలోనే అయినా శ్యామలన్ మూలాలతో పాటు ఆలోచనలు కూడా భారతీయతతో నిండి ఉంటాయి. ప్రతి చిత్రంలోనూ భారతీయ ఆధ్యాత్మికత, తాత్విక విషయాలను మిస్టరీలో జొప్పించి, థ్రిల్లర్‌లను తెరకెక్కించడం అతని ప్రత్యేకత.
 
  ‘సిక్త్స్ సెన్స్’ కథను కాస్త నిశితంగా పరిశీలిస్తే ‘ఆత్మ శాంతి’ అనే భారతీయ అంశాన్ని తెరకెక్కించాడని మనకే అర్థమౌతుంది. అలాగే - ‘ది లాస్ట్ ఎయిర్‌బెండర్’ అనే సినిమాలో దేవుడి అవతారాల గురించి చెబుతాడు. ఇలా అతని కథలు ఒక ఎత్తయితే, వాటి స్క్రీన్‌ప్లే ఇంకొక ఎత్తు. ఎంతో సాధారణమైన కథతో సినిమా తీసినా, క్లైమాక్స్‌ను మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించని విధంగా తీస్తాడు. సినిమా ఆఖరి టైటిల్స్ పడేంత వరకూ కథ నడుస్తూనే ఉంటుంది. అంతేకాదు, అతని ప్రతి చిత్రంలోనూ చివర్లో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది. ఇదే అతని సినిమాల ప్రత్యేకత.
 
 ఈ కొత్త రకమైన మేకింగ్ వికటించి, ఎన్నో డిజాస్టర్‌లు అందించినా ఆ పద్ధతిని మాత్రం వదల్లేదు. అందుకే ఇప్పటికీ హాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పెయిడ్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా చెలామణి అవుతున్నాడు మనోజ్. సాధారణ జీవితం, అసాధారణ సంఘటనలు, ఊహకందని మలుపులు - ఇదే శ్యామలన్ ట్రేడ్ మార్క్. అవును ఇంతకీ ‘సిక్త్స్ సెన్స్’లో శ్యామలన్ ట్రేడ్ మార్క్ గురించి చెప్పనేలేదు కదూ! అందులో క్రోవ్ కేవలం డాక్టరే కాదు... ఒక ఆత్మ కూడా!
 

>