పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

6 Jun, 2018 13:04 IST|Sakshi
మదాలస శర్మ, మహాక్షయ్‌ చక్రవర్తి

సాక్షి, ముంబై : బాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. సోనమ్‌ కపూర్‌, నేహా ధూపియాలు గత నెలలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్‌ శ్వేతాబసు ప్రసాద్‌ కూడా త్వరలోనే బాలీవుడ్‌ దర్శకుడిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం మరో హీరోయిన్‌ మదాలస శర్మ కూడా తన వివాహ తేదీని ప్రకటించేశారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, మాజీ ఎంపీ మిథున్‌ చక్రవర్తి తనయుడు మహాక్షయ్‌ చక్రవర్తితో జూలై 7న తన వివాహం జరగనున్నట్లు మదాలస శర్మ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మదాలస.. ​​​​​‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ ఆశ్చర్యపోలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్‌ ఇంట్లో మా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అందుకే ఇది లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అనుకోవచ్చు. అయితే మా వివాహం ఎక్కడ జరుతుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ కచ్చితంగా ముంబైలో మాత్రం జరగదు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’ అంటూ చిరునవ్వులు చిందించారు.

కాగా 2008లో ‘జిమ్మీ’  సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన మహాక్షయ్‌కు‌.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ప్రస్తుతం పెద్దగా అవకాశాలేమీ రావడం లేదు. అదే విధంగా 2011లో ‘ఏంజెల్‌’  సినిమాతో బాలీవుడ్‌ తెరకు పరిచయమైన మదాలస.. తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు.  

మరిన్ని వార్తలు