పన్ను మినహాయింపు ఇచ్చిన రెండు రాష్ట్రాలు

9 Jan, 2020 18:06 IST|Sakshi

భోపాల్‌ : యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ పాత్రంలో దీపికా పదుకొనే నటించిన ఛపాక్‌ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్థులను దీపికా పరామర్శించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆమె జేఎన్‌యూకి వెళ్లిన మరుక్షణం నుంచి  సోషల్‌ మీడియా వేదికపైగా ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఛపాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలని పోస్ట్‌లు పెడుతున్నారు. సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఛపాక్‌ సినిమాకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు అండగా నిలిచాయి. ఈ సినిమాకు పన్ను పసూలు నుంచి మినహాయింపు ఇచ్చాయి. ఈ మేరకు మొదట మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించగా.. వెంటనే ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో ఆమె అభిమానులు రెండు రాష్ట్రాల సీఎంలకు అభినందనలు తెలుపుతున్నాయి. (దీపికపై ట్రోలింగ్‌.. స్పందించిన కనిమొళి)

అయితే  పన్ను మినహాయింపు నిర్ణయం మరో కొత్త చర్చకు దారి తీసింది. దీపికా జేఎన్‌యూ వెళ్లడంతో బీజేపీ, ఏబీవీపీకి చెందిన కొందరు ఆమెను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఛపాక్‌ చిత్రాన్ని బహిష్కరించాలంటూ బహిరంగ ప్రకటనలకు దిగుతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రానికి పన్ను మినహాయింపు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఆమెకు అండగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో విడుదలకు ముందు ఈ చిత్రం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. ఛపాక్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం విడుదలపై పలు ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. సినియాలోని రాజేష్‌ పాత్రపై కోర్టుకు వెళతామంటూ బీజేపీ ఎంపీల నుంచి బీజేపీ యువజన కార్యకర్తలు, సానుభూతిపరుల వరకు ట్వీట్ల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు