మడోనా వస్తువులు వేలానికి...!

31 Oct, 2014 23:55 IST|Sakshi
మడోనా వస్తువులు వేలానికి...!

 హాలీవుడ్ స్టార్ మడోనా మరో నాలుగేళ్లలో 60వ పడిలోకి అడుగుపెడతారు. మామూలుగా అయితే వయసులో ఉన్న తారలతో పోల్చితే.. ఇలా వయసు పైబడిన తారలకు తక్కువమంది అభిమానులుంటారు. కానీ, మడోనా విషయంలో అలా కాదు. టీనేజ్ తారలకు కూడా లేనంత మంది అభిమానులు ఈ హాట్ లేడీకి ఉన్నారు. ఆ అభిమానులందరికీ ఓ శుభవార్త. మడోనా నటించిన పలు చిత్రాల్లోని చెప్పుకోదగ్గ దుస్తులు, నగలను వేలానికి పెట్టనున్నారు. అలాగే పాదరక్షలు, చలువ కళ్లద్దాలు, వ్యక్తిగతంగా ఆమె వాడిన సౌందర్య సాధనాలు, దుస్తులు... ఇలా మొత్తం 140 వస్తువులు వేలానికి రానున్నాయి.
 
  ఈ వేలం పాటను నిర్వహించనున్న జూలియన్స్ ఆక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మార్టిన్ నోలన్ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల పాటు జూలియన్స్ ఆక్షన్స్‌లోను, ఆన్‌లైన్ ద్వారాను ఈ వేలం పాట జరగనుంది. మడోనాకి సంబంధించిన వస్తువులను వేలానికి పెట్టడం ఇప్పుడు కొత్త కాదు. ఇప్పటివరకు చాలాసార్లు జరిగింది. కానీ,  ఏకంగా 140 వస్తువులు వేలానికి రావడం ఇదే మొదటిసారి. దీని ద్వారా 30 కోట్ల రూపాయల రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తంలో ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నారు. నవంబర్ 7న ఈ వేలం పాట ఆరంభం కానుంది.