'ఇళయరాజా కేసును రెండు వారాల్లో ముగించండి'

1 Mar, 2020 07:43 IST|Sakshi

మద్రాసు హైకోర్టు ఆదేశం

సాక్షి, పెరంబూరు: సంగీతదర్శకుడు ఇళయరాజా కేసు విచారణను రెండు వారాల్లోకి ముగించాలని చెన్నై మధ్యవర్తిత్వ కోర్టుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళయరాజా స్థానికి సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో తన చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. గత 42 ఏళ్లుగా అదే స్టూడియోలో తన సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇళయరాజాను ఇటీవల ఆ స్టూడియో అధినేత ఖాళీ చేయాల్సిందిగా చెప్పారు. అకస్మాత్తుగా ఖాళీ చేయమనడంతో ఇళయరాజా అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో దర్శకుడు భారతీరాజా, అమీర్, ఆర్‌కే.సెల్వమణి, కే.భాగ్యరాజ్‌ వంటి వారు ఇళయరాజా తరఫున ప్రసాద్‌స్టూడియో అధినేతతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే అవి ఫలించలేదు.  చదవండి: కమల్‌ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ముమ్మరం 
 
దీంతో ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. 17వ సహాయ నగర మధ్యర్తిత్వ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈయన పిటీషన్‌ను విచారించిన కోర్టు సామరస్య చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇళయరాజా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తన పిటిషన్‌లో ప్రసాద్‌ల్యాబ్‌లో తాను 42 ఏళ్లుగా సంగీత వాయిద్యాలతో పని చేస్తున్నానన్నారు. అక్కడ వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చానని, 6 వేలకు పైగా పాటలకు సంగీతాన్ని అందించానని పేర్కొన్నారు.

ఇప్పుడు కూడా తన చిత్రాల సంగీత పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై కూడా అదే స్టూడియోలో ప్రశాంతంగా తనను పని చేసుకునేలా ఆదేశించాలని కోరారు. తనను ప్రసాద్‌ల్యాబ్‌ నుంచి బయటకు పంపాలన్న వాదనపై  స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. న్యాయమూర్తి భారతీదాస్‌ సమక్షంలో విచారణ జరిగింది. ఇళయరాజా పిటిషన్‌పై విచారణను రెండు వారాల్లో ముగించాలని 17వ సహాయ నగర మధ్యవర్తిత్వ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు.  చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? 

మరిన్ని వార్తలు