కోచ్చడయాన్‌కు వినోదపు పన్ను రద్దు

22 May, 2014 23:22 IST|Sakshi
కోచ్చడయాన్‌కు వినోదపు పన్ను రద్దు

కోచ్చడయాన్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వినోదపు పన్ను వసూలు చేయరాదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి వినోదపు పన్నును రద్దు చేయాలని కోరుతూ చెన్నై ఎన్నూర్‌కు చెందిన ముత్తయ్య అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళంలో పేరు పెట్టిన చిత్రాలకు వినోదపు పన్ను రద్దు చేస్తూ 2007లో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. ఆ తర్వాత ఈ విధానంలో కొన్ని సవరణలు చేస్తూ 2011లో మరోసారి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
 
 ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొ న్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర జీవోపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ ప్రధానాధికారి 2014 ఏప్రిల్ 16న తెనాలి రామన్ చిత్రానికి వినోదపు పన్ను వసూలు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారని పేర్కొన్నారు. అదే విధంగా కోచ్చడయాన్ చిత్రానికి ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారని వివరించారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించిందని, అలాంటిది కోచ్చడయాన్‌కు వినోదపు పన్ను విధించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తెలిపారు.
 
 అలాగే కోర్టును అవమానించే చర్య అవుతుందని పేర్కొన్నారు. అందువల్ల కోచ్చడయాన్ చిత్రానికి వినోదపు పన్ను రద్దు చేయాలని న్యాయవాది ముత్తయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ఆర్.మహదేవన్‌తో కూడిన బెంచ్ విచారించింది. కోర్టు స్టే విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కాదని వినోదపు పన్ను మినహాయిం పు చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు. అదే విధంగా సగటు ప్రేక్షకుడి నుంచి థియేటర్ల యజమాన్యం చిత్ర వినియోగదారుల వినోదపు పన్నును వసూలు చేయరాదని పేర్కొన్నారు. ఈ కేసులో థియేటర్ల యాజ మాన్యాన్ని ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్‌కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును ప్రత్యేక కేసుతో పాటు విచారించనున్నట్టు న్యాయమూర్తులు వెల్లడించారు.