దేవుణ్ణి చూడాలనుకుంటే షోకి రండి! – సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌

2 Nov, 2017 00:39 IST|Sakshi

‘‘ఇళయరాజా ఉన్న కాలంలో మనం ఉండడం అదృష్టం. అదీ మనందరి ముందు ఆయన లైవ్‌ పర్ఫార్మెన్స్‌ ఇవ్వడం మరింత అదృష్టం. (‘మ్యూజిక్‌’) దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజా (ఇళయరాజా) గారి షోకి రండి. ఆయన సంగీత దర్శకత్వంలో ‘చిరుగాలి వీచెనే’ పాట పాడే చాన్స్, ఆయన్ని కలసే చాన్స్‌ ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్‌’’ అన్నారు సంగీత దర్శకులు–నటుడు–దర్శక–రచయిత ఆర్పీ పట్నాయక్‌. ఈ ఆదివారం (నవంబర్‌ 5న) హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా ‘స్వరజ్ఞాని’ ఇళయరాజా లైవ్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

‘‘ఇళయరాజా లైవ్‌ షోకి ఫ్రీ పాసులు కావాలా? అయితే... ‘రాజా కాలింగ్‌ ఆజా’ పోటీలో పాల్గొనండి’’ అని ‘సాక్షి’ పాఠకులకు ‘షో క్విజ్‌’ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పోటీకి అనూహ్య స్పందన లభించింది. వాళ్లలో సరైన సమాధానాలు రాసి పంపిన 600 మందిని ఎంపిక చేశారు. 600 మందిలోంచి 200 మంది లక్కీ మెంబర్స్‌ను ఆర్పీ పట్నాయక్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ ఎంపిక చేశారు.  ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా, ‘వినవయ్యా రామయ్యా’, ఈ శుక్రవారం విడుదలవుతోన్న ‘ఏంజెల్‌’లో హీరోగా నటించిన నాగ అన్వేష్‌ మాట్లాడుతూ– ‘‘రాజాగారి పాటల్లో ‘రుద్రవీణ’లోని ‘తరలిరాద తనే వసంతం..’ పాటంటే నాకెంతో ఇష్టం. టీవీలో ఆ పాట ఎప్పుడొచ్చినా... పనులన్నీ పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుంటా.

లక్కీ డ్రాలో పాసులు పొందిన 200 మందికి కంగ్రాట్స్‌. నా ఫ్రెండ్స్, స్టాఫ్‌ కూడా పాసులు అడుగుతున్నారు. ఒక్క ఎక్స్రా›్ట పాస్‌ ఉంటే నాకు ఇవ్వండి’’ అన్నారు. ‘మీ దగ్గర ఒక్క పాస్‌ ఉంటే... ఇంట్లో ఇల్లాలిని తీసుకువెళతారా? వంటింట్లో ప్రియురాలిని తీసుకువెళతారా?’ అని నాగ అన్వేష్‌ని అడగ్గా... ‘‘నేను ఇంట్లో కూర్చుని ఇద్దరినీ రాజాగారి లైవ్‌ కన్సర్ట్‌కి పంపిస్తా’’ అని నవ్వేశారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొనడం హ్యపీగా ఉందని హెబ్బా పటేల్‌ చెప్పారు.

విజేతలు (200 మంది)... తమ వివరాలను ‘సాక్షి’ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే, వాళ్ల మొబైల్‌ నంబర్లకు ఎసెమ్మెస్‌ల ద్వారా సమాచారం అందుతుంది. నవంబర్‌ 2, 3, 4వ తేదీల్లో హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ఆఫీసులో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విజేతలు తమ మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ చూపించి పాసులు పొందవచ్చు. సుదూర ప్రాంతాల వాళ్లు 5వ తేదీ మధ్యహ్నం 2 గంటలలోపు వచ్చి పాసులు పొందవచ్చు. ఫార్వార్డ్‌ మెసేజ్‌లకు పాసులు ఇవ్వబడవు. ఏ నంబర్‌కి మెసేజ్‌ వస్తే.. ఆ నంబర్‌కే పాస్‌ ఇవ్వబడును.

మరిన్ని వార్తలు