సినీ మాయలోళ్లు

22 Feb, 2014 23:36 IST|Sakshi
సినీ మాయలోళ్లు

 కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ.
 ఇది ఇంద్రజాలానికి కూడా వర్తిస్తుంది.
 కాగితపు ముక్క, బ్లేడు ముక్క, పేకముక్క.. కాదేదీ మేజిక్కుకి అనర్హం.
 
 అయితే తెలియాల్సిందల్లా రెప్పపాటులో ప్రేక్షకులను మాయ చేయడమే. వాస్తవానికి ఇంద్రజాలం తెలిసినవారు చాలా తక్కువమంది ఉంటారు. కానీ, వారు చేసే ఆ మేజిక్ చూసినప్పుడు ఎంచక్కా మనక్కూడా ఆ విద్య తెలిస్తే బాగుండు అనుకుంటాం.

 

ముఖ్యంగా పసిపిల్లలు చందమామ కావాలని మారాం చేసినప్పుడో, ప్రేయసికి ఇవ్వాలనుకున్న గులాబీ దొరకనప్పుడో మేజిక్ తెలిస్తే చటుక్కున సృష్టించేయొచ్చుగా అనుకోకుండా ఉండరు. ఇలా సందర్భానికి తగ్గట్టు మేజిక్ తెలిసుంటే బాగుంటుంది అనుకుంటాం. కొంతమంది పనిగట్టుకుని ఆ విద్యను నేర్చుకుంటారు. అదే వృత్తిగా స్వీకరించేవాళ్లూ ఉంటారు.

 

అలాగే ప్రవృత్తిగా చేసుకునేవాళ్లూ ఉంటారు. అలాంటి కొంతమంది గురించి  మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోతున్నవారు సినిమా పరిశ్రమలో తెరవెనుకా, తెరపైనా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసినవారే. సినిమా కళతో పాటు వారికి మేజిక్ అనే కళ కూడా తెలుసు. నేడు ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఆ సినీ మేజిక్ కళాకారుల గురించి తెలుసుకుందాం...
 
 తెరపై ఇందజ్రాలికుడుగా: నాటితరం ప్రేక్షకులను ఓ స్థాయిలో నవ్వించిన అద్భుతమైన హాస్యనటుడు రమణారెడ్డి.. తన కామెడీతో మేజిక్ చేసిన రమణారెడ్డికి నిజంగా కూడా మేజిక్ తెలుసు. ఎంతో పట్టుదల, క్రమశిక్షణతో నేర్చుకుని ప్రజల ముందు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బ్లేడు ముక్కను అమాంతంగా మింగేసి, ప్రేక్షకులను అబ్బురపరిచేవారు రమణారెడ్డి. ఆయన చేసే ఈ రిస్కీ మేజిక్‌ను అప్పట్లో ఎంతో ఉత్కంఠగా చూసేవారట. ఇంకా పలు వస్తువులతో ఆయన మేజిక్ చేసేవారు. వెండితెరపైన ఆయన ‘అక్కాచెల్లెలు’ చిత్రంలో మెజిషియన్‌గా చేశారు.

ఆయన కలం ఓ మేజిక్: ఆరుద్ర వాడే కలానికి ఏదో మేజిక్ ఉంది. ఆ కలం నుంచి జాలువారిన ప్రతి కవితా, పాటా ఓ మేజిక్కే. అదే కలంతోనే ఆయన మేజిక్ చేసేవారు. ఇష్టమైన పువ్వు పేరు తల్చుకోమని అడిగేవారట. ఆ తర్వాత పేపర్ మీద పెన్నుతో ఏదైనా రాసి, వాసన చూడమనేవారట ఆరుద్ర. వాసన చూడగానే ఆ పువ్వు తాలూకు పరిమళం ముక్కుపుటాలను తాకేదని ఆ అనుభూతి పొందినవారు చెప్పిన దాఖలాలు ఉన్నాయి.

ముక్కలతో మేజిక్: హాస్యం అపహాస్యం కాకుండా కుటుంబమంతా కలిసి ఆస్వాదించదగ్గ చక్కని కామెడీ చిత్రాలను అందించిన జంధ్యాల నిజజీవితంలో కూడా చాలా సరదాగా ఉండేవారు. జంధ్యాల చమత్కారాలు బాగుంటాయని ఆయన స్నేహితులు అంటుంటారు. అలాగే, తీరిక చిక్కినప్పుడు పేకముక్కలు, అగ్గిపుల్లలతో ఆయన బోల్డన్ని మేజిక్కులు చేసేవారనీ అవన్నీ రసవత్తరంగా ఉండేవని చెబుతుంటారు. జంధ్యాల తీసే సినిమాలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ప్రేక్షకులు. ఆయన మేజిక్ కూడా అదే విధంగా ఉండేదట.

భలే మాయలోడు: వెండితెరపై తనదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించే రాజేంద్రప్రసాద్‌కి మేజిక్ తెలుసు. ‘మాయలోడు’ సినిమాలో బోల్డన్ని మాయలు చేసిన రాజేంద్రుడు నిజంగా కూడా కొన్ని మేజిక్‌లు చేస్తుంటారు. మేజిక్ అంటే తనకు వచ్చిన కళను చేసుకుంటూ పోవడం కాదు. కొన్ని చమత్కారాలు జోడించాలి. హావభావాలు పలికించాలి. వీటిలో దిట్ట అయిన రాజేంద్రప్రసాద్ చేసే మేజిక్స్ భలే పసందుగా ఉంటాయట.

 

రబ్బర్ బ్యాండ్స్‌తో: ఆడవాళ్లు జడలకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లే శరత్‌బాబు మేజిక్‌కి ఆయుధాలు. వాటితో శరత్‌బాబు చేసే మేజిక్కులు వీక్షకులను అబ్బురపరుస్తాయి. శరత్‌బాబుకి ఉన్న ఈ ప్రతిభ తెలుసుకుని, ఆయన్ను కదిలిస్తే... రబ్బర్ బ్యాండ్స్‌తో బోల్డన్ని ప్రదర్శనలు ఇస్తారట.
  - డి.జి. భవాని