భయంతోనూ మేలే!

21 Feb, 2019 11:30 IST|Sakshi
కీర్తీసురేశ్‌

సినిమా: భయంతో భలే మేలు అంటోంది నటి కీర్తీసురేశ్‌. ప్రారంభ దశలోనే బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న కేరళ కుట్టి ఈ బ్యూటీ. చిన్నతనం నుంచే నటి నవ్వాలన్న ఆశను పెంచుకుంటూ వచ్చిన కీర్తీసురేశ్‌ తన కుటుంబసభ్యులు వద్దన్నా, ఎలాగో వారిని ఒప్పించి నటిగా రంగప్రవేశం చేసిన ఈ భామ అనతికాలంలోనే కథానాయకిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అలా ఆరంభ దశలో ఏ నటి సాహసించని మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన ద్విభాషా చిత్రం నడిగైయార్‌ తిలగం (మహానటి) చిత్రంలో సావిత్రిగా నటించి ఆ పాత్రకు తనకుంటే గొప్పగా ఎవరూ చేయలేరన్నట్లు ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో కమర్శియల్‌ చిత్రాల కథానాయకిగానూ తనదైన ముద్ర వేసుకున్న కీర్తీసురేశ్‌ కోలీవుడ్‌లో వరుసగా సామీస్క్వేర్, సండైకోళి–2, సర్కార్‌ అంటూ వరుసగా స్టార్స్‌ చిత్రాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్‌లో నటిస్తోంది. అదేవిధంగా మాతృభాషలోనూ నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన సినీ అనుభవాలను మీడియాతో పంచుకుంది. అవేంటో ఒక లుక్కేద్దాం. సినిమాను ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. అయితే నటీనటులకు సినిమానే జీవితం.

ఒక్కో పాత్రను ఒక జీవితంలా అనుభవించినట్లు నటిస్తున్నాం. దర్శకులు చెప్పిన కథలు విన్న తరువాత అందులోని కథా పాత్రకు న్యాయం చేయగలమా? లేమా? అన్నది పదిసార్లు ఆలోచిస్తాం. ఆ పాత్రలు ప్రేక్షకులకు నచ్చుతాయా? అన్న కోణంలోనూ ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలతోనే అందరు నటీనటులు కథలను ఎంచుకుని నటిస్తున్నారు. ఇతరుల కంటే నాకు అలాంటి ప్రశ్నలు కాస్త ఎక్కువే. అలా ప్రశ్నించి నటించడం వల్ల నాకు మంచే జరుగుతోంది. ఒక్కో చిత్రంలో నటించే ముందు లక్ష ప్రశ్నలు, భయాలు కలిగినా అన్నింటికీ దర్శకుల వద్ద జవాబులుంటాయి. అయినా ఒక్కో చిత్రంలో నటించేటప్పుడు నాకు భయమేస్తుంది. ఆ భయంతోనూ నాకు మేలే జరుగుతోంది. భయం కారణంగా కథా పాత్రలపై మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది. సినిమా పయనం ఒక సస్పెన్స్‌ కథ మాదిరి ఉండాలి. మహానటి చిత్రంలో నటించేటప్పుడు భయపడుతూనే నటించాను. అయితే ఆ చిత్ర విజయంతో అనుభవించిన సంతోషాన్ని మాటల్లో చెప్పనలవికాదు అని లక్కీ బ్యూటీ కీర్తీసురేశ్‌ చెప్పింది.

మరిన్ని వార్తలు