'మహానటి’.. ఆ నలుగురు

15 Jun, 2018 10:45 IST|Sakshi

సిటీకి వచ్చిన తెరవెనుక కష్ట జీవులు

చిత్రానికి పనిచేయడంపై ఆనందం వ్యక్తం 

బంజారాహిల్స్‌ : తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అద్భుతావిష్కరణ. ‘మహానటి’కిమహోన్నత ‘రూప’కల్పన. కీర్తి సురేష్‌లో సావిత్రిని పరకాయ ప్రవేశం చేసినట్లు తీర్చిదిద్దిన వైనం. ఆ నలుగురు సాంకేతిక నైపుణ్యానికితార్కాణం. ప్రేక్షకులను రంజింపజేసి.. మహానటి చిత్ర విజయంలో తమదైన పాత్ర పోషించారు వారు. కీర్తి సురేష్‌కు సావిత్రి పోలికలు, లుక్‌ను తీసుకురావడానికి నలుగురు సాంకేతిక నిపుణులు తెర వెనుక చేసిన కృషి అంతా ఇంతా కాదు. సావిత్రి నటించిన సినిమాలను ఒకటికి పదిసార్లు చూశారు. ఆమె హావభావాలు, డ్రెస్సింగ్, హెయిర్‌ స్టైల్‌ ఒంటబట్టించుకున్నారు.

కీర్తి సురేష్‌ను తెరపై జీవింపజేశారు. సావిత్రి రూపురేఖలను అచ్చుగుద్దినట్లు తీర్చిదిద్దడానికి కాస్ట్యూమర్‌ బొడ్డు శివరామకృష్ణ, హెయిర్‌స్టైలిస్ట్‌ రజబ్‌ అలీ, కాస్ట్యూమ్‌ స్పెషలిస్ట్‌ ఇంద్రాక్షి, మేకప్‌ మెన్‌ మూవేంద్రన్‌ కృషి అపురూపమైనది. వీరంతా ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. మహానటి సినిమాకు ఎలా కష్టపడింది, ఆ సినిమా ఏ మేరకు పేరుతీసుకొచ్చిందనే విషయాలపై ‘సాక్షి’తో ముచ్చటించారు. 

190 హెయిర్‌ స్టైల్స్‌ మార్చాం
నాది ముంబై. ఐదేళ్లుగా హెయిర్‌ స్టైలిస్ట్‌గా సినిమాల్లో పనిచేస్తున్నాను. అనుకోని వరంలా మహానటి సినిమాకు పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించడానికి సుమారు 20 సినిమాలు నెల రోజుల పాటు చూడాల్సివచ్చింది. మూగ మనసులు సినిమాను ఆరు రోజులు ఏకధాటిగా చూశా. అందులో సావిత్రి హెయిర్‌ స్టైల్‌ను అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌కు తీసుకొచ్చాను. ఒకే విగ్గును 190 హెయిర్‌ స్టైల్స్‌గా మార్చాం.  సావిత్రి ఒక్కో సినిమాలో ఒక్కో హెయిర్‌ స్టైల్‌తో ఆకట్టుకునేవారు. ఆమెది పొడవాటి జుట్టు. కీర్తి సురేష్‌ది తక్కువ జుట్టు. దీంతో విగ్గుతోనే సావిత్రిని తెరపై సృష్టించాల్సి వచ్చింది. ఇంకో వైపు సావిత్రి జుట్టు బాగా ఉంటే కీర్తి సురేష్‌ది సిల్కీ హెయిర్‌. దీంతో సావిత్రి జుట్టు తీసుకురావడానికి హెయిర్‌స్టైల్స్‌ను రకరకాలుగా మార్చాల్సి వచ్చింది. నా కెరీర్‌లోనే ఇదో అద్భుత అవకాశం. 
– రజబ్‌ అలీ, హెయిర్‌ స్టైలిస్ట్‌  

120 రోజుల కృషి ఫలితం ఇది..
మహానటి సినిమాకు 120 రోజుల పాటు పనిచేశా. పాత సినిమాలను ఔపోసన పట్టాను. ముఖ్యంగా నర్తనశాల, గుండమ్మకథ సినిమాలను పది రోజుల పాటు రేయింబవళ్లూ చూశాను. సావిత్రి హావభావాలు, ఆమె డ్రెస్సింగ్, ఆమె నడక, ఆమె కళ్లు ఎగరేసే తీరు ఇవన్నీ పరిశీలించాను. ఇంకో వైపు సావిత్రి చీర ఎలా కట్టుకుంటుంది, ఎలా నడుస్తుంది అన్నది ఈ సినిమాకు ఇంపార్టెంట్‌. ఇంకోవైపు సావిత్రి ఐనెక్‌ బ్లౌజ్‌లు వేసుకునేది. ఇప్పుడవి లేవు. ఆ తరహా బ్లౌజ్‌లను కుట్టించి సావిత్రి లుక్‌ను తెచ్చేందుకు చాలా కష్టపడ్డాను. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రి లాంటి మహానటిని తెరమీద కీర్తి సురేష్‌లో తీర్చదిద్దడానికి కృషి చేయడం సంతోషంగా ఉంది. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి సావిత్రిని తెరపై చూపించాలంటే ఎంత కష్టమో తెలిసింది. – బొడ్డు శివరామకృష్ణ, కాస్ట్యూమర్‌

చీరకట్టుతోనే సావిత్రి అందం
సావిత్రి అందమంతా చీరకట్టులోనే ఉండేది. సంప్రదాయ తెలుగు యువతిని చూడాలంటే సావిత్రిని చూడాల్సిందే. కీర్తి సురేష్‌ను సావిత్రిలా చూపించాలంటే అప్పటి ఆమె కట్టు, బొట్టు బాగా ఆకళింపు చేసుకున్నా. ఇంకేముంది తగిన కాస్ట్యూమ్‌ను తగిన రీతిలో తీర్చిదిద్దాం.  ఇందు కోసం రెండు నెలల పాటు కష్టపడ్డాం. సావిత్రి నడిచే విధానం, ఆమె చీరకట్టు గమనించడానికి చాలా రోజులు పట్టింది. అచ్చుగుద్దినట్లు కీర్తి సురేష్‌ను తెరపై చూపించాలంటే కాస్ట్యూమ్‌కు ఉన్న ప్రాధాన్యం గమనించాను. ఈ సినిమా ఇంత హిట్‌ కావడం నా జీవితంలోనే మరిచిపోలేనిది. ఇలాంటి సినిమాకు పనిచేయడం గర్వంగా ఉంది. 
 – ఇంద్రాక్షి, స్టైలిస్ట్‌  

ఆమె కళ్లతోనే భావాలు పలికించేవారు
మహానటి సావిత్రి సినిమాను కీర్తి సురేష్‌తో తియ్యడం అందులో నేను మేకప్‌ మెన్‌గా ఉండటం అదృష్టమనే చెప్పాలి. సావిత్రి నటించిన 15 సినిమాలు రేయింబవళ్లూ చూసి ఆమె మేకప్‌ను గమనించాను. కీర్తి సురేష్‌కు ఎలా మేకప్‌ వేస్తే సావిత్రి లుక్‌ వస్తుందో అంచనాకు వచ్చాను.  బ్లాక్‌ అండ్‌ వైట్‌ సీన్స్, కలర్‌ సీన్స్‌లో కీర్తి సురేష్‌ ఎలా ఉంటుంది, ఆ మేరకు మేకప్‌ ఎలా వేయాలి అన్నదానిపైనే దృష్టి  సారించాను. సావిత్రి కళ్లు బాగుంటాయి. అవే కళ్లను కీర్తి సురేష్‌కు తీసుకురావాలంటే 20 రకాల వేరియేషన్స్‌ను తీసుకొచ్చాం. ముఖ్యంగా ఐబ్రోతోనే కీర్తి సురేష్‌కు సావిత్రి లుక్‌ అక్షరాలా ఒంటబట్టింది. సినిమా ఇంతగా హిట్‌ అవుతుందని మాకు షూటింగ్‌ సమయంలోనే తెలిసింది. ఎందుకంటే ఆ సినిమాకు పడుతున్న కష్టం దగ్గరుండి గమనించాను.   
– మూవేంద్రన్, మేకప్‌మెన్‌

మరిన్ని వార్తలు