తెలుగువాడిగా పుట్టడం అదృష్టం

9 Jun, 2019 03:23 IST|Sakshi
బుద్ధ ప్రసాద్, సంజయ్‌కిషోర్, చిరంజీవి, తనికెళ్ల, బ్రహ్మానందం, తమ్మారెడ్డి, రోజారమణి, రేలంగి, అలీ

– చిరంజీవి

‘‘నేను అభిమానించే నటుల్లో ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ ముఖ్యులు. వారి నటన సహజంగా ఉంటుంది. ఎస్వీఆర్‌ నటునిగా ఒక ఎన్‌సైక్లోపీడియా’’ అని నటుడు చిరంజీవి అన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటునిగా చిర కాలం గుర్తుండిపోయె నటుడు ఎస్వీ రంగారావు.  ఆయనపై రచయిత, జర్నలిస్ట్, ‘సంగం’ అకాడమీ వ్వవస్థాపకుడు సంజయ్‌కిషోర్‌ రచించిన ‘మహానటుడు’ పుస్తకాన్ని చిరంజీవి విడుదల చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహానటుడు’ పుస్తక రచయిత సంజయ్‌ కిషోర్‌ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

ఎందుకంటే పుస్తకం రచించడం ఆషామాషీ కాదు. ఎంతో నిబద్ధతతో చేయాల్సిన పని.  ఎస్వీఆర్‌గారిపై నాకు అంత అభిమానం కలగటానికి కారణం మా నాన్నగారు.  ఆయనకి నటనంటే ఎంతో ఇష్టం. అప్పట్లో ఆయన డ్రామాలు వేస్తూ ఉండేవారు. సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా అప్పటి ఆర్థిక స్తోమత దృష్ట్యా చేయలేక పోయారు. కానీ నాన్నగారు బాపట్లలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అనుకోకుండా చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చింది.  ‘జగత్‌ కిలాడీ’, ‘జగత్‌జంత్రీలు’ సినిమాల్లో ఎస్వీఆర్‌గారితో నటించే అవకాశం మా నాన్నకు వచ్చింది.

అది ఆయన చేసుకున్న అదృష్టం. షూటింగ్‌ నుండి నాన్న ఇంటికి వచ్చిన తర్వాత.. సెట్లో ఎస్వీఆర్‌గారు ఎలా మాట్లాడతారు? ఎలా నటిస్తారు? అని చెప్పేవారు. ఆ విధంగా రంగారావుగారి మీద నాకున్న అభిమాన బీజాన్ని నాన్నగారే వేశారేమో. రామ్‌చరణ్‌ సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఎస్వీఆర్‌గారి గురించి చెప్పి, ఆయన సినిమాలు చూపించేవాడిని. మానాన్న గారి దగ్గరి నుండి నేను, నా నుంచి రామ్‌చరణ్‌ ఎస్వీఆర్‌గారి నుంచి స్ఫూర్తి పొందాం. అలాంటి మహానటుడు, గొప్పనటుడు తెలుగు వాడిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం.

నేను నటుడు కావటానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిని ఒక్కసారి కూడా నేను చూడలేకపోయానే, ఒక్క ఫొటోగ్రాఫ్‌ కూడా లేదే అనేది తీరని కోరికగా మిగిలింది. అలాంటిది ఆయనపై వచ్చిన ఈ çపుస్తకాన్ని ఆవిష్కరించటంతో ఆ బాధ తీరింది’’ అన్నారు. కాగా ‘మహానటుడు’ తొలి ప్రతిని హరనా«ద్‌బాబు లక్షా వేయి నూటపదహారు రూపాయలకు కొనుగోలు చేశారు. నటులు రావికొండలరావు, రోజారమణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీతో పాటు, కిమ్స్‌ హాస్పిటల్స్‌ అధినేత బొల్లినేని కృష్ణయ్య, మండలి బుద్ధ ప్రసాద్, ఎస్పీ రంగనా«ద్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు