చూడకపోతే చూడండి... చూస్తే మళ్లీ చూడండి

4 Oct, 2017 00:12 IST|Sakshi

శర్వానంద్‌

‘‘వైజాగ్‌ సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌ కోర్స్‌ నేర్చుకున్నా. ‘మహానుభావుడు’ సినిమా ద్వారా వైజాగ్‌ ప్రజల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమా చూడకపోతే చూడండి.. చూస్తే మళ్లీ చూడండి’’ అని హీరో శర్వానంద్‌ అన్నారు. శర్వానంద్, మెహరీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ‘మహానుభావుడు’ దసరా సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం థ్యాంక్స్‌ మీట్‌ని వైజాగ్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న దసరావళి కార్యక్రమంలో థ్యాంక్స్‌ మీట్‌ జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది.

మారుతి, శర్వానంద్‌ మా ఫ్యామిలీ మెంబర్స్‌ లాంటివాళ్లే. ఈ చిత్రం హిట్‌ అయినందుకు సో హ్యాపీ’’ అన్నారు. ‘‘మహానుభావుడు’ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ముందుగా ధన్యవాదాలు. ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాన్ని మరచిపోయేలా ‘మహానుభావుడు’ చిత్రానికి విజయం అందించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాని అందరూ ఇంకా బాగా ఆదరించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘‘నా రెండో చిత్రం ‘మహానుభావుడు’. మా చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్‌ రావటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు మెహరీన్‌. ‘‘మా సినిమా సక్సెస్‌ ఎనర్జీ మమ్మల్ని వైజాగ్‌ వచ్చేలా చేసింది’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్‌. చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్, సహనిర్మాత ఎస్‌కెఎన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు