హైదరాబాద్‌లో పెరిగిన సినిమా టికెట్‌ ధరలు

8 May, 2019 03:42 IST|Sakshi

‘మహర్షి’ విడుదల నేపథ్యంలో రెండువారాలు అమలు 

అనుమతి లేదంటున్న మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి సినిమా టికెట్‌ ధరలు పెరిగాయి. ‘మహర్షి’సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్లు టికెట్ల ధరలు పెంచాయి. దీనికి థియేటర్ల యాజమాన్యాల సంఘం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ పెంపు 9వ తేదీ నుంచి రెండు వారాలపాటు అమలులో ఉంటుంది. నగరంలోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.30, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 చొప్పున పెంచుతున్నట్లు తెలిపాయి. కానీ ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో మాత్రం ఈ పెంపుదల రూ.62 వరకు ఉండటం గమనార్హం. కాగా, మహేశ్‌బాబుకు చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో మాత్రం ఇప్పటికే టికెట్‌పై రూ.200, రూ.300 వసూలు చేస్తుండటం గమనార్హం. మహర్షి సినిమాకు మాత్రం ఏఎంబీలో ఎలాంటి పెంపుదల లేదు. నగరంలో టికెట్ల రేట్లు పెంపుదలకు ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ వస్తున్న వార్తలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు. మ హర్షి సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం టికెట్ల పెంపుదలకు ఎవరికీ ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. 
థియేటర్‌              పాత ధర      కొత్త ధర 
సింగిల్‌ స్క్రీన్‌          రూ.80        రూ.110 
మల్టీప్లెక్స్‌              రూ.130      రూ.180 
ప్రసాద్‌ ఐమ్యాక్స్‌     రూ.138     రూ.200 

మరిన్ని వార్తలు