సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

31 Aug, 2019 05:52 IST|Sakshi
మహేశ్‌ ఆచంట

‘రంగస్థలం, మహానటి, గుణ 369’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్‌ ఆచంట హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నేను నా నాగార్జున’. ఆర్‌.బి. గోపాల్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ జియన్‌ఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై గుండపు నాగేశ్వరరావు నిర్మించారు. ఆగస్టు 29న హీరో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ వేడుక నిర్వహించారు. ఈశ్వర్‌ పెరావళి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను నిర్మాత మళ్ల విజయప్రసాద్, ట్రైలర్‌ని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌ విడుదల చేశారు. మహేష్‌ ఆచంట మాట్లాడుతూ– ‘‘జబర్దస్త్‌’ ప్రోగ్రామ్‌ ఆపేసి చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నేను ఏ అవకాశం వస్తే ఆ సినిమా చేశాను. ‘రంగస్థలం’కి ముందే ఈ చిత్రం చేశాను.

ఒక సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ ‘నేను నా నాగార్జున’. కథ విన్నప్పుడు మా ఊరిలో రాంబాబు అనే సైకిల్‌ షాప్‌ కుర్రాణ్ణి స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశా. చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అష్టకష్టాలు పడి ఈ సినిమా పూర్తి చేశాం. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు సాయం చేశారు. వారందరికీ థ్యాంక్స్‌. మంచి తేదీ చూసుకొని త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గుండపు నాగేశ్వర రావు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి కె.ఎల్‌.  దామోదర ప్రసాద్, నిర్మాతలు మళ్ల విజయప్రసాద్, రామ సత్యనారాయణ, సాయివెంకట్, బసిరెడ్డి, టి.ప్రసన్నకుమార్, బాలాజీ నాగలింగం, దర్శక–నిర్మాత బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు