మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

21 Feb, 2019 03:38 IST|Sakshi

ఏఎంబీ మాల్‌లో సినిమా టికెట్లపై  అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తింపు 

చర్యలకు ఉపక్రమించే ముందు తగ్గించిన యాజమాన్యం

రూ.35 లక్షలు చెల్లించాలని ఆదేశాలు..

సాక్షి, హైదరాబాద్‌ : సినీనటుడు మహేశ్‌బాబుకు మరోసారి జీఎస్టీ షాక్‌ తగిలింది. మహేశ్‌ బాబు కు సంబంధించిన ఏఎంబీ మాల్‌లోని మల్టీప్లెక్స్‌లపై ప్రదర్శిస్తున్న సినిమాల టికెట్ల ధర విషయంలో జీఎస్టీ నిబంధనలను అతిక్రమించారని, తగ్గించిన పన్ను ఆధారంగా టికెట్లు అమ్మకుండా ఎక్కువ వసూలు చేశారని జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో జీఎస్టీ అధికారులు చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధమయ్యే తరుణంలో ఏఎంబీ మాల్‌ యాజమాన్యం టికెట్‌ ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. అయినా టికెట్‌ ధరలు ఎక్కువగా వసూలు చేసినందుకు రూ.35 లక్షలు చెల్లించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుం టామని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవలే మహేశ్‌బాబు ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో పన్ను వసూలు చేసిన జీఎస్టీ అధికారులు మళ్లీ ఇప్పుడు ఆయనకు సంబంధించిన మాల్‌ నుంచి పన్ను వసూలుకు ఉపక్రమించడం గమనార్హం. 

సినిమా మాల్స్‌పై ప్రత్యేక దృష్టి: తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం సినిమా టికెట్లు అమ్ముతున్నారా లేదా అనే కోణంలో హైదరాబాద్‌ జీఎస్టీ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నట్లు కన్పిస్తోంది. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా టికెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారనే ఆరోపణలపై ప్రసాద్, ఐమ్యాక్స్, పీవీఆర్, ఐనాక్స్‌ లాంటి మల్టీప్లెక్స్‌లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దీంతో చాలా మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్‌ కూడా రంగంలోకి దిగడంతో ఏఎంబీ మాల్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

మరిన్ని వార్తలు