హీరో మహేష్‌బాబు ఉదారత

25 Jun, 2020 08:17 IST|Sakshi

నెల రోజుల బాబుకి గుండె శస్త్రచికిత్స  

తూర్పుగోదావరి, అల్లవరం: మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కుంచె ప్రదీప్, నాగజ్యోతిల నెల రోజుల బాబుకి గుండెశస్త్ర చికిత్సకు ప్రముఖ హీరో మహేష్‌బాబు సహకరించి నిజజీవితంలో రియల్‌ హీరో అయ్యాడు. మే 31 సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో బాబుకు గుండె శస్త్రచికిత్స చేయించారు. ఈ దంపతులకు మొదటి కాన్పులో బాబు పుట్టాడు. మొదట్లో ఆరోగ్యంగా ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ బాబు శరీరంలో మార్పులు గమనించి అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. బాబును పరీక్షించిన వైద్యులు అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్టుగా గుర్తించి త్వరితగతిన శస్త్ర చికిత్స చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. (మహేశ్‌తో ఢీ?)

మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా హైదరాబాద్‌ తీసుకెళ్లాల్సి ఉంటుందని, ఖర్చు ఎక్కువగానే అవుతుందని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రదీప్‌ అమలాపురంలో తన స్నేహితుడు ద్వారా హీరో మహేష్‌బాబు ట్రస్టు ద్వారా పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయిస్తున్నారని తెలుసుకుని విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇనిస్టిట్యూట్‌ వైద్యులను గత నెల 30న సంప్రదించారు. రెండు రోజుల అనంతరం జూన్‌ 2న శస్త్ర చికిత్స వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్స తర్వాత బాబు ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించింది. బీపీ తక్కువగా నమోదుకావడం, గుండె కొట్టుకోవడంలో తేడా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు రెండు  వారాల అనంతరం బాబు కోలుకుని ఆరోగ్యంగా ఉండడంతో స్వగ్రామానికి పంపించారు. ప్రస్తుతం బాబు పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రదీప్‌ తెలిపారు. తమ బాబుకి పునర్జన్మ ఇచ్చిన హీరో మహేష్‌బాబుకి ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు